YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ మండుతున్న కూరల ధరలు

మళ్లీ మండుతున్న కూరల ధరలు

 మళ్లీ మండుతున్న కూరల ధరలు
అనంతపురం, అక్టోబరు 1,
మార్కెట్‌లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్‌ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్‌ అయి ఒక రేటును ఫిక్స్‌ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్‌ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు  నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్‌ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్‌లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్‌ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్‌లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్‌ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్‌లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. 

Related Posts