అసైన్డ్ భూముల అడ్డగోలు విక్రయాలు
గుంటూరు, అక్టోబరు 1,
రాష్ట్ర రాజధాని అమరావతిలో భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్డ్ ములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్‌డీఏ అధికారులు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు. అధికార పార్టీ నేతలు అసైన్డ్ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్ రైతులు కోల్పోయారు.