సోది లేకుండా పోయిన టీ వైసీపీ నేతలు
ఖమ్మం,
అవును! రాజకీయాలంటేనే అంత! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం సర్వసాధారణం. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజకీయంగా ఎందో దూకుడు ప్రదర్శించిన నాయకులు ఇప్పుడు కంటికి కూడా కనిపించకుండా పోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే.. వైసీపీ ఆవిర్భావం తర్వాత పలు పార్టీల నుంచి నాయకులు వచ్చి ఈ పార్టీలో చేరిపోయారు. వీరిలో కొందరు తెలంగాణ ఉనికి ఉన్న నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలోనూ పోటీ చేసింది. ముఖ్యంగా ఏపీ బోర్డర్‌లో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ సత్తా చాటింది. ఒక ఎంపీ సీటుతో పాటు ఏకంగా మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది.వీరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, బాణోతు మదన్ లాల్, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరు ఖమ్మం నుంచి పోటీ చేశారు. పొంగులేటి ఖమ్మం ఎంపీగా వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. మిగిలిన ముగ్గురు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అశ్వారావు పేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, , వైరా నుంచి బాణోతు మదన్ లాల్, , పినపాక నుంచి పాయం వెంకటేశ్వరు పోటీ చేసి.. అప్పటి రాష్ట్ర విభజన వేడిలో కూడా వీరు వైసీపీ తరఫున సంచలన విజయాన్ని నమోదు చేశారు. అయితే, రాజకీయ సమీకరణల నేపథ్యంలో వీరంతా తర్వాత కాలంలో అధికార టీఆర్ ఎస్‌లోకి చేరిపోయారు.అయితే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన ఈ ముగ్గురు నాయకులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. అయితే, వీరు ఘోరంగా ఓడిపోయారు. వైరాలో మదన్‌లాల్ ఓటమి చెందగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన లావుడ్యా రాములు నాయక్ గెలిచారు. ఇక పినపాకలో పాయం వెంకటేశ్వర్లు ఓడిపోగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాధించారు. అశ్వారావుపేటలో టీడీపీ నుంచి పోటీ చేసిన మచ్చా నాగేశ్వరరరావు గెలిచారు. వీరిలో రేగా కాంతారావు, రాములు నాయక్ టీఆర్ఎస్‌లో చేరడంతో పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్‌ను పట్టించుకునే వారే లేరు. అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయన్ను పార్టీలో ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు.ఇక, ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఈయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావు టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. దీంతో 2014లో తెలంగాణలోనే వైసీపీ తరపున గెలిచి సంచలనం క్రియేట్ చేసిన ఈ నలుగురికి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఎంత మాత్రం ప్రాధాన్యం లేకుండా పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి సంచలన విజయాలు నమోదు చేసి, ఇప్పుడు సోదిలో లేకుండా పోవడంతో వీరికి రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.