బాబు ఇంటికి కేరళ వైద్యం
విజయవాడ, అక్టోబరు 1,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు కి ఇప్పట్లో పరాభవాలు తప్పేలా లేవు. ఆయన అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ చట్టవిరుద్ధంగా నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినందున ఖాళీ చేయాలనీ వైసిపి సర్కార్ వచ్చిన నాటి నుంచి అరచి గోల పెడుతుంది. కృష్ణా వరదల సమయంలో ఈ అంశం జాతీయ స్థాయి వరకు వెళ్ళింది కూడా. అయినా తాను నివాసం వుండే ఇల్లు కూల్చే దాకా వెళ్లకుండా ఉంటే మైలేజ్ వస్తుందన్న లెక్కల్లో చంద్రబాబు ఖాళీ చేసేందుకు ఇప్పటివరకు ప్రయత్నాలు చేస్తుంది లేదు.దాంతో ఇటీవల మళ్ళీ సర్కార్ తుది గడువు విధించింది. కరకట్టపై వున్న ఇతర అక్రమ నిర్మాణాల్లో వున్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపి ఖాళీ చేయించే పనిలో పడింది. వీటన్నింటికన్నా ముందు ప్రజావేదికను కూల్చి ముందస్తు హెచ్చరికలను చంద్రబాబు కి పంపింది వైసిపి ప్రభుత్వం. అయినా అటు నుంచి పోరాట వైఖరే తప్ప వెనుకడుగు వేయబోమనే సంకేతాలే వచ్చాయి.కేరళలోని కోచి మరుదు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. మరుదు పంచాయితీ గా వున్న సమయంలో తీరప్రాంతాన్ని ఆనుకుని నాలుగు భారీ భవంతులు వెలిశాయి. వాటి నిర్మాణానికి పంచాయితీ అనుమతులు మంజూరు చేసింది. ఆ తరువాత మరుదు మునిసిపాలిటీగా మారింది. దాంతో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఇలాంటి నిర్మాణాలు పర్యావరణానికి ప్రమాదం అంటూ సుప్రీం కోర్టు లో కేసు దాఖలు అయ్యింది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీం తక్షణం ఆ నాలుగు అపార్ట్ మెంట్లను కూల్చివేయాలని బాధితులకు 25 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి బిల్డర్ల నుంచి ఆ సొమ్ము రికవరీ చేసుకోవాలని ఆదేశించింది. దీనిపై ప్లాట్ ఓనర్లు ఎంత గగ్గోలు పెట్టినా, ఆందోళనలు చేసినా సుప్రీం కనికరించలేదు. పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు మానవాళికి ప్రమాదమని తేల్చింది. కేరళ సర్కార్ కి పనిలో పనిగా అక్షింతలు వేసేసింది.కేరళ మరుదు కేసు జగన్ సర్కార్ కి అదనపు బలం తెచ్చిపెట్టనుంది. ఈ కేసును విస్తృతంగా ఇప్పటికే వైసిపి మీడియా ప్రచారంలో పెట్టేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దె ఇల్లు కూల్చివేతకు ముహూర్తం పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ వ్యవహారంపై కోర్టే ను ఆశ్రయించినా ఫలితం ఉండదని తేలిపోతున్నందునే న్యాయస్థానం గుమ్మం ఎక్కేకన్నా రాజకీయంగా పోరాటం చేయడమే మైలేజ్ తెస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.ఆయన వ్యూహాలు ఎలా వున్నా కేరళ మరుదు కేసుతో నదీ పరివాహాక ప్రాంతంలోని లింగమనేని నిర్మించిన అందమైన భవంతి కి మాత్రం రక్షణ లభించడం కష్టమనే విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు పై కక్ష సాధింపు టిడిపి నేతలపై కక్ష సాధింపు అనే ప్రచారం ఎలాగూ ఉన్నందున కొత్తగా పోయేదేమీ లేదని జగన్ సర్కార్ దూకుడు గా వెళుతుందా లేక మరికొంతకాలం చంద్రబాబు తో మైండ్ గేమ్ ఆడుతుందో చూడాలి.