YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేట్ దందా షురూ..

ప్రైవేట్ దందా షురూ..

 ప్రైవేట్ దందా షురూ...
కడప, అక్టోబరు 1,
పండుగ సీజన్‌ వచ్చిందంటే ప్రయివేటు ఆపరేటర్లు వసూళ్ల పండగ చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా బస్సు ఛార్జీలను పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దసరా పండుగతో పాటు వరుస సెలువులు రావడంతో ప్రయివేటు బస్సుల్లో ప్రయాణించే వారి పర్సు ఖాళీ కాకా తప్పడం లేదు. పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి ఏర్పడిన డిమాండ్‌నే ప్రయివేటు ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి. బస్సు రూటుతో పని లేకుండా ఛార్జీలను రెట్టింపు చేసేశారు. అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఛార్జీలను నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసిలో సాధారణ సమయాల్లో కంటే 50 శాతం రెట్టింపు ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులను నడుపుతుంటే ప్రయివేటు ట్రావెల్స్‌ మాత్రం మామూలు సర్వీసుల్లోనే అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. అధిక రద్దీ వల్ల ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు వీలు లేక చాలా మంది ప్రయాణికులు అదనపు ఛార్జీలతోనే ప్రయివేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.ఆర్టీసిలోని సూపర్‌ లగ్జరీ బస్సుల్లో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో మామూలు రోజుల్లో రూ.480 ఉండగా, ప్రయివేటులో దాన్ని ఎసి సెమీ స్లీపర్‌లో రూ.1150, స్లీపర్‌లో అయితే రూ.2వేలకు పైనే వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి పులివెందులకు నడిపే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ.572 ఉండగా ప్రయివేటు బస్సుల్లో రూ.900లకు పైనే వసూలు చేస్తున్నారు. ప్రయివేటు ట్రావెల్స్‌ నడిపే సాధారణ సర్వీసుల్లో రూ.450 ఉన్న విజయవాడ-కర్నూలు మార్గంలో రూ.1000 నుంచి రూ.1200, స్లీపర్‌లో అయితే రూ.1350 నుంచి రూ.1500లకు ఛార్జీని పెంచేశారు. రూ.610 ఉన్న విజయవాడ- అనంతపురం బస్సుల్లో రూ.1000 నుంచి రూ.1500 వరకూ, రూ.440 ఉన్న విజయవాడ-నంద్యాల బస్సుల్లో రూ.900 నుంచి రూ.1050 వరకూ వసూలు చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ప్రయివేటు బస్సులో విజయవాడ-కదిరికి రూ.600 ఉంటే అదే బస్సులో ఇప్పుడు ప్రయాణించాలంటే రూ.800 చెల్లించాల్సి వస్తోంది. రూ.300 నుంచి రూ.500 మధ్య ఉండే విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో ఏకంగా రూ.700 నుంచి రూ.1600 వరకూ వసూలు చేస్తున్నారు.పండగ సీజన్‌లో సొంత గ్రామాలకు ప్రయాణికులు సీట్ల కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టినా సీట్లు లభించడం లేదు. ఆయా ప్రయివేట్‌ ట్రావెల్స్‌ ఆపరేటర్లు ముందుగా టికెట్లను బుక్‌ చేసేసి ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండును బట్టి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి.దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1377 ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడపనుంది. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 7 వరకూ సాధారణ బస్సు సర్వీసులతో పాటు ఈ అదనపు సర్వీసులు నడవనున్నాయి. గతేడాది దసరా సందర్భంగా 1196 ప్రత్యేక బస్సులు నడిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 27న 135 ప్రత్యేక బస్సులు హైదరాబాదు నుండి ఎపిలోని వివిధ ప్రాంతాలకు నడిచాయి. 28న 85 బస్సులు, 29న 22 బస్సులను తిప్పారు. 30న 15 బస్సులు, అక్టోబర్‌ 1న 56 బస్సులు, 2న 25 బస్సులు, 3న 54 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే 4న 500 బస్సులు, 5న 302 బస్సులు, 6న 123 బస్సులు, 7న 60 బస్సులు హైదరాబాదు నుండి వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీలు రావాల్సి వస్తుందని, అందు కోసమే ఈ అదనపు మొత్తాన్ని ముందు నుంచి వసూలు చేస్తున్నామని ఆర్టీసి అధికారులు చెబుతున్నారు

Related Posts