గాయత్రిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
విజయవాడ,
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున కనక దుర్గమ్మ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రిదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరులు గాయత్రిదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది.గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపుగారెలు నివేదన చేస్తారు. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.