దేశ నలుమూలల ప్రసిద్ధి చెందిన తొలి తెలుగు వాగ్యేయకారుడు అన్నమాచార్యులు క్రీశ 1408 మార్చి 14 న తాళ్ళపాకలో జన్మించారు.అంతటి ఘనకీర్తిని సాధించిన కవిగాన సంకీర్తనా పరుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు కలియుగ వైకుంఠనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి, పారవశ్య, శృంగార సంకీర్తనలు ఎన్నో ఆలపించారు. శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు వైకుంఠనాధునికి అత్యంత ప్రీతిపాత్రునిగా చరిత్రలోకెక్కారు. ఏడుకొండల శ్రీనివాసునిపై 32వేల సంకీర్తనలను ఆలపించిన ఘనత అన్నమాచార్యులు దక్కించుకొన్నారు.
అన్నమయ్య రాసిన కీర్తనలతో వైకుంఠనాధుని మెప్పించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తాళ్ళపాక అన్నమాచార్యుని కీర్తి ఎంతచెప్పినా తక్కువగానే అవుతుంది. ఆయన రాసిన కీర్తనలు నేటికి ఎన్నటికి చరిత్ర పుటల్లో నిలిచిపోయేంత గాన మాధుర్యాన్ని రక్తింపచేస్తాయని చెప్పవచ్చు. అంతటి ఘనకీర్తి సాధించిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచర్యులు క్రీశ 1408 సంవత్సరంలో క్రోది వైశాఖ శుద్ధపౌర్ణమి రోజున తాళ్ళపాక గ్రామంలో తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరిలకు జన్మించాడు. యుక్తవయస్సులో తల్లిదండ్రుల కోరిక మేరకు తిరుమలకు వెళ్ళి మళ్ళీ తాళ్ళపాకకు చేరుకొని తిమ్మక్క సుభధ్రను పరినయం ఆడారు. అన్నమయ్య మొదటి కుమారుడు తిరుమలాచార్యులు కూడా కీర్తనలను రచించారు. తాళ్ళపాక గ్రామంలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం, సుదర్శన చక్రంలు ప్రతిష్టింప బడి ఉన్నాయి.
ఈ ఆలయాలు 9వ శతబ్దానికి చెందినవిగా టి.టి.డి వారు గుర్తించారు. 1982లో అన్నమయ్య ఆరాధాన మందిరాన్ని నిర్మించి అందులో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనలు తిరుమలలోని బాంఢాగారంలో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో వేలాధి కీర్తనలు కనుమరుగు కాగా, కొన్ని మాత్రమే లభ్యమయ్యాయి. తరువాత టిటిడి ఆసంకీర్తనలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చిందని చెప్పవచ్చు. 108 సంకీర్తనలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచరించారు. అన్నమాచార్య ప్రాజెక్టును 1978లో ఏర్పాటు చేసి ఆయన రచించిన కీర్తనలు ఆయన భక్తి మార్గం గురించి ప్రపంచ నలుమూలలకు వినిపించేలా చర్యలు చేపట్టింది. టిటిడి స్వాధీన పరుచుకొన్న తరువాత తాళ్ళపాక గ్రామంతో పాటు రాష్ర్ట రహదారిలో సమీపంలో కోట్లాదిరూపాయలు వెచ్చించి అన్నమయ్య ధీమ్‌పార్కును ఏర్పాటు చేసి 108 అడుగుల తెలుగు వాగ్యేయకారుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.