ఏపీలో విద్యుత్ కోతలపై మండిపడ్డ చంద్రబాబు
గుంటూరు అక్టోబర్ 1
ఏపీలో విద్యుత్ కోతలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ నుంచి విద్యుత్ కోతల దిశగా తీసుకెళ్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.
ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వమని - అందుకే నిరంతర విద్యుత్ సరఫరా నుంచి కరెంట్ కోతలు విధించే స్థాయికి తీసుకొచ్చారని చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. తమ
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతర విద్యుత్ అందుబాటులోకి తెస్తే దానిని కూడా రివర్స్ చేశారన్నారు. అసలు విద్యుత్ పై ముఖ్యమంత్రి జగన్ కు అవగాహనలేదని - జగన్
పెద్ద జగమొండి అని - ఎవరైనా మంచి చెబితే వినడం లేదని విమర్శించారు. ఆయన మొండితనం వల్లే సామాన్య ప్రజలకు - రైతులకు కష్టాలు దాపురించాయని - జగమొండితనం
జనానికి శాపంగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు రైతులకు 9 గంటల విద్యుత్ అని గొప్పలు చెప్పారని - ఇప్పుడు సగం కోసేశారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిందని - అందుకే రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. థర్మల్ విద్యుత్ పై ఆధారపడడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని -
పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం సౌర - పవన్ విద్యుత్ వైపు అడుగులేసిందని అన్నారు. దీని వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని చెప్పారు.
ఇప్పటికైనా సౌర - పవన్ విద్యుత్ పై దృష్టి పెట్టి రాష్ట్రంలో విద్యుత్ కోతలనీ అరికట్టాలని - రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.