YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో షురూ అయిన గేమ్

 కర్ణాటకలో షురూ అయిన గేమ్

అన్ని పార్టీల్లో కుమ్ములాటలే. అంతర్గత విబేదాలే. ఏ పార్టీ నింపాదిగా లేదు. ధైర్యం అసలే లేదు. ఉప ఎన్నికలు పడ్డాయన్న సంతోషం క్షణం సేపు మిగలలేదు. మళ్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. కర్ణాటకలోని పదిహేను నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 5వ తేదీన పదిహేను స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవబంరు 11వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. దీంతో కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.అభ్యర్థుల ఎంపిక పక్కన పెడితే కర్ణాటకలోని అన్ని పార్టీల్లో ఇప్పుడు ఉప ఎన్నికల గుబులు బయలుదేరింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. విచారణ పూర్తయితే కాని వీరి పోటీపై ఒక క్లారిటీ రాదు. అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై బీజేపీలోనే ఒక వర్గం గుర్రుగా ఉంది. ఇతరపార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశమివ్వడమేంటన్న ప్రశ్నను సంధిస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను దరిద్రులుగా అనడం వివాదాస్పదమయింది.దీనిపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.లక్ష్మణ సవదిపై బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ లోనూ లుకలుకలు బయలుదేరాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, దినేశ్ గుండూరావులపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన సిద్ధరామయ్యకు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వకూడదని కొందరు నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో పార్టీ భ్రష్టుపట్టడానికి కారకులైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తమ సంగతేంటో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. యడ్యూరప్ప చేతిలో ఏమీ లేదని తెలిసిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు నేరుగా అధిష్టానంతోనే అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అయిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకుంటే తమకు ఇచ్చేప్రాధాన్యతపై వారు అధిష్టానం నుంచే క్లారిటీ కావాలంటున్నారు. ఇలా కర్ణాటకలో అన్ని ప్రధాన పార్టీల్లోనూ అసంతృప్తి రాజుకుంది. ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండటం, ఈ ఉప ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అసంతృప్తులను చల్లార్చకుంటే అసలేకే ఎసరు తప్పదులాగుంది

Related Posts