మైండ్ గేమ్ లో వైసీపీ
విజయవాడ, అక్టోబరు 3(
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకే ఎందుకు వల వేస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారినే అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే తోట త్రిమూర్తులు వంటి వారు వైసీపీలో చేరిపోయారు. పంచకర్ల రమేష్ బాబు రెడీ గా ఉన్నారు. ఇంకా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది మైండ్ గేమ్ అని టీడీపీ భావిస్తున్నప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మాజీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరుస్తుందంటున్నారు.అంతా సవ్యంగా జరిగితే దసరా తర్వాత దాదాపు పది మంది వరకూ తాజా మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కోస్తా, రాయలసీమ నుంచి కూడా కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చేస్తామని కబురు మీద కబురు పంపుతున్నారట. అందుకే వారంతా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వారు కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బిజీగా ఉండటంతో కొందరికి అపాయింట్ మెంట్ దొరకడం లేదంటున్నారు. కోస్తా ప్రాంతానికి చెందిన ఒక బలమైన టీడీపీ నేత జగన్ అపాయింట్ మెంట్ కోసం పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయన రాకతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాపై కూడా ప్రభావం ఉండటంతో జగన్ కండువా కప్పడం గ్యారంటీ. ముఖ్యంగా కాపు, వెలమ, యాదవ, కమ్మ సామాజికవర్గాలకు చెందిన నేతలకు వైసీపీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా సార్వత్రిక ఎన్నికలు నాలుగున్నరేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో వైసీపీని బలంగా చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది.మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలంటే అందరి సహకారం అవసరం. ఓటమినుంచి తేరుకోలేని టీడీపీ ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని తయారు చేసుకోలేదు. ద్వితీయ శ్రేణి నేతలే నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అందుకే మాజీ ఎమ్మెల్యేలే బెటరని జగన్ భావిస్తున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరగడం ఖాయం కావడంతో వారికి టిక్కెట్ల ప్లాబ్లం ఉండదని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. వారికే కండువాలను కప్పేయాలని నిర్ణయించింది. దీంతో చాలా చోట్ల టీడీపీ బలహీన పడే అవకాశాలున్నాయి.