జేసీ సోదరుల పక్కచూపులు
అనంతపురం, అక్టోబరు 3,
అనంతపురంలో రాజకీయాలు మారుతున్నాయి. ప్రస్తుతం అంతా నిశ్శబ్ధంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రతి విషయంలోనూ వేలుపెట్టి రాజకీయం చేసిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన సుదీర్ఘ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టిన జేసీ.. తన వారసుడికి ఇక్కడ టీడీపీ టికెట్ ఇప్పించారు. టికెట్ అయితే ఇప్పించుకోగలిగారు కానీ.. తొలి ఎన్నికలో వారసుడిని గెలిపించుకోలేక పోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయంలో తొలి ఓటమిని పుత్రరత్నం రూపంలో ఎదుర్కొనాల్సి వచ్చింది.జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సైతం పోటీకి దూరంగా ఉండడంతో పాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకోగా ఆయన కూడా ఓడిపోయారు.దీంతో జేసీ సోదరులు ఒక్కసారిగా డీలా పడ్డారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అంచనాలు తప్పాయి? ఎవరు నా వాళ్లు.. ఎవరు కానివాళ్లు.. ఎవరు నాతోనే అంటగాకుతూ.. పక్కపార్టీకి సాయం చేశారు? అనే విషయాలపై తీవ్రంగా ఆలోచించారు. చివరకు ఆయనను టీడీపీ నేతలు రిసీవ్ చేసుకోలేదని అర్ధమైంది. పైకి నవ్వుతూ నే, వెనకాల చేయాల్సింది చేశారనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు.అయితే, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేసినా.. పరిస్థితి సానుకూలంగా మారే పరిస్థితి లేదు. దీనిని గమనించిన జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే మేలని భావించారు. అయితే, వ్యూహాత్మ కంగా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్ తరఫున 1985లో తాడిపత్రి నియోజకవర్గంలో తొలిసారి విజయం సాధించిన జేసీ దివాకర్ రెడ్డి 2014 ఎన్నికల వరకు అప్రతిహత విజయాలను నమోదు చేసుకున్నారు. ఒకే పార్టీ ఇక్కడ విజయం సాధిం చింది. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహం పెంచుకోవడంతో జేసీ దివాక ర్ రెడ్డి వర్గం పార్టీ మారిపోయింది.ఆ టైంలో వైసీపీలోకి వెళ్లాలా? టీడీపీలోకి వెళ్లాలా? అనే మీమాంస ఏర్పడి నప్పు డు.. టీడీపీ వైపే మొగ్గు చూపారు. ఆ పార్టీ అదినేత చంద్రబాబు కూడా వీరికి ఆహ్వానం పలకడంతో పాటు తాడిపత్రి టికెట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డికి, అనంతపురం ఎంపీటికెట్‌ను జేసీ దివాకర్‌రెడ్డికి ఇచ్చారు. ఈ ఇద్దరూ ఆ ఎన్నికల్లో అప్రతిహత విజయం నమోదు చేశారు. ఐదేళ్ల పాటు అనంత జిల్లాలో జేసీ సోదరులు దూకుడుగా వెళ్లినా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడులా వారి ఆటలు సాగలేదు. వారి జోరుకు టీడీపీ నాయకులు పదే పదే బ్రేక్ వేస్తూ వచ్చారు.ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుని కుమారులకు వీరు బాటలు పరిచారు. అయితే, ఇద్దరు వారసులు కూడా ఫెయిలయ్యారు. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్నా ప్రయోజనం లేదని, తమపై నమోదైన కేసుల విషయంపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టకముందుగానే.. తాను పార్టీ మారడం మంచిదనే వ్యూహంలో ఉన్నట్టు జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ముచ్చటగా మూడో పార్టీలో జేసీ రాజకీయం అందునా 70 వసంతాల వెలుగులో ఎలా ఉంటుందో చూడాలి. అదే టైంలో జేసీ సోదరులు వారసులు ఇద్దరూ టీడీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఓ సందర్భంలో జేసీనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పేశారు. ఇక ఇప్పుడు జేసీ వారసుల దృష్టి వైసీపీ ఉండడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీకి బైబై చెప్పేసి ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో ? చూడాలి.