రెంటికి చెడ్డరేవడిలా గంటా మురళీ
ఏలూరు, అక్టోబరు 3,
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. ఒకరి ఎదుగుదలకు మరొకరు గండి కొట్టడం, ఒకరి ఎదుగుదలకు మరొకరు అసూయ చెందడం వంటివి సాధారణమే. అయితే, కుటుంబాల పరంగా చూసుకున్నప్పుడు కూడా ఫ్యామిలీలకు ఫ్యామిలీలే రాజకీయ వైరుధ్యాలతో రగిలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీనే.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కోటగిరి, గంటా కుటుంబాలు. కోటగిరి విద్యాధర రావు, గంటా మురళీ రామకృష్ణ ఫ్యామిలీలు రాజకీయంగా బద్ధ శత్రులుగా మెలిగారు. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అలాంటి ఫ్యామిలీలో తుదకు కోటగిరి విద్యాధరరావు వారసుడు శ్రీధర్ తాజాగా పైచేయి సాధించడం విశేషం.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి 1983, 1999 వరకు కోటగిరి విద్యాధరరావు వరుసగా ఐదు విజయాలు సాధిచారు. అయితే, తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో మురళీ రామకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య రాజకీయంగా అనేక అభిప్రాయ భేదాలు, పైచేయి సాధించాలనే పంతాలు పేట్రేగాయి. తర్వాత కాలంలో కోటగిరి విద్యాధర్‌రావు.. ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అయితే, కొన్నాళ్లకే ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఈ నేపథ్యంలో కోటగిరి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అటు గంటా, ఇటు కోటగిరి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ఒకే నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది.అయినప్పటికీ.. తమ పంతాలకే వీరిద్దరూ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే వచ్చిన స్థానిక సంస్తల ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉన్నా.. సవాళ్ల రాజకీయం సాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గంటా కాంగ్రెస్, కోటగిరి కాంగ్రెస్ అన్న విధంగా సాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మురళీ కాంగ్రెస్, కోటగిరి విద్యాధరరావు కాంగ్రెస్ పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. మురళీ 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో కోటగిరి విద్యాధరరావు మృతితో ఆయన కుమారుడు రాజకీయ అరంగేట్రం చేశారు. దీంతో కోటగిరి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అయితే, అక్కడ ఇమడలేక.. 2014 తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కోటగిరి శ్రీధర్ కు జగన్ ఏలూరు ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు.అయితే మళ్లీ గంటా, కోటగిరి శ్రీధర్‌లు ఒకే పార్టీ వైసీపీలో పనిచేయాల్సి రావడంతో మరోసారి ఆధిపత్య రాజకీయాలకు తెరదీసినట్టు అయింది. కోటగిరి శ్రీధర్ పైచేయి సాధించాలని గంటా చూశారు. ఇద్దరిదీ కామవరపుకోట మండలం కావడంతో మరింత దూకుడు రాజకీయాలు పెరిగాయి. ఈ క్రమంలో దాదాపు 2 ఏళ్లపాటు సుదీర్ఘమైన ఆధిపత్యం సాగింది. చివరిగా గంటా మురళీ కన్నా కోటగిరి శ్రీధర్ దూకుడు పెంచారు.గంటా మురళీ తన సొంత నియోజకవర్గం అంటూ చింతలపూడిలో హవా సాగాలని ప్రయత్నించారు. ఈ నియోజకవర్గంలో తాను చెప్పిన వ్యక్తికే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని జగన్ వద్ద పట్టుబట్టారు. అయితే, ఎంపీ అభ్యర్థిగా ఉండడంతో జగన్ కోటగిరి శ్రీధర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఇక, తాను వైసీపీలో ఉండలేక.. మరళీ ఈ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లారు. ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కోటగిరి శ్రీధర్‌ను ఓడించాలని చూశారు. అయినా జగన్ సునామీ నేపథ్యంలో కోటగిరి శ్రీధర్ భారీ మెజార్టీతో గెలిచాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గత ఐదేళ్ల కాలంలో వైసీపీలో ఉన్న గంటా మురళీ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి వెళ్లి.. మరోసారిఇప్పుడుప్రతిపక్షానికేరిమితమయ్యారు. అదే సమయంలో పార్టీలు మారే నాయకుడిగా పేరు పోగోట్టుకున్నాడు. ఇలా కోటగిరి శ్రీధర్ మాత్రం గంటా పై పైచేయి సాధించి.. తన పట్టు నిలుపుకొన్నారు. గంటా మురళీ కీలక టైంలో వేసిన రాంగ్ స్టెప్‌తో ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా మారిపోయాడు. ఈ క్రమంలో గంటా మురళీతో తన తండ్రి టైం నుంచి ఉన్న రివేంజ్‌ను కోటగిరి శ్రీధర్ పరిపూర్ణంగా తీర్చేసుకున్నట్లయ్యింది.