Highlights
- పీవీ సింధు, సైనా నెహ్వాల్,
- కిడాంబి శ్రీకాంత్‌పైనే టైటిల్ ఆశలు
- టైటిల్‌పై గురి పెట్టిన సైనా, సింధులు
- సర్వీస్ పై ఆసక్తి..
పదిహేడేండ్లుగా భారత్‌ను ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ట్రోఫీని ఈసారి గెలుచుకునేందుకు భారత షట్లర్లు సన్నద్దులయ్యారు. బుధవారం నుచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి రంగం సిద్ధమైంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌పైనే టైటిల్ ఆశలున్నాయి. భారత్ తరపున ఆల్‌ఇంగ్లండ్ ట్రోఫీని ప్రకాశ్ పదుకోణ్ (1980), పుల్లెల గోపీచంద్ (2001) గెలుచుకున్నారు. ఆ తర్వాత సైనా పదిసార్లు ఈటోర్నీలో పాల్గొన్నప్పటికీ 2015లో రన్నరప్‌గా నిలువడమే ఆమెకు అత్యుత్తమ ప్రదర్శన. ఇక ఐదుసార్లు ఈ టోర్నీ ఆడిన సింధు గతేడాది క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగింది. దీంతో ఈసారి ఈసారి సైనా, సింధు టైటిల్‌పై గురి పెట్టారు. తొలిరౌండ్‌లో సింధుకు సులభమైన డ్రా ఎదురవగా, సైనా కఠినమైన ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ తై జుతో తలపడబోతున్నది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ ఆశాకిరణం కిడాంబి శ్రీకాంత్ ఫ్రాన్స్ ఆటగాడు బ్రీస్ లెవర్డెజ్‌తో పోటీపడనున్నాడు. ప్రపపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్‌సెన్ కాలి చీలమండ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం శ్రీకాంత్‌కు కలిసొచ్చే అంశం. ఇతడితో పాటు సాయిప్రణీత్, ప్రణయ్ పురుషుల సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడి..పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి, సాత్విక్ జోడి..మిక్స్‌డ్ డబుల్స్‌లో జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి పోటీకి దిగుతున్నది.
సర్వీస్ ఎలా ఉంటుందో..
ఇక కొత్తగా ప్రవేశపెట్టిన 1.15మీటర్ల సర్వీస్ నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ టోర్నీలో అవి ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. సర్వీస్ చేసేటపుడు షటిల్‌కు రాకెట్ 1.15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో తాకొద్దని నిబంధన ప్రవేశపెట్టారు. ఇది పొడుగ్గా ఉన్న ఆటగాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. సింధుకు ఈ నిబంధన ఇబ్బందికరం కాగా, సైనాకు కొంత అనుకూలంగా ఉండనున్నది.