యదేఛ్చగా ముందుల విక్రయాలు
ఖమ్మం, అక్టోబరు 3,
ఉమ్మడి జిల్లాలో రిటైల్ మందుల దుకాణాలు ఏజెన్సీలు ఔషధాలను విక్రయిస్తున్నాయి. అన్ని దుకాణాల్లోనూ నిషేధిత జాబితాలోని మందుల వినియోగమే అధికంగా ఉంటుంది. ఎఫ్‌డిసి మందుల ద్వారా నష్టమే ఎక్కువగా జరుగుతుందని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఒకే మందులో రెండు, మూడు రోగాలకు సంబంధించిన యాంటిబయోటిక్స్ ఉపయోగిస్తారు. వీటిలో కొన్ని రకాలు వైద్యుని చీటితో వాడాలి. మరికొన్నింటికి మినహాయింపు ఉంది. ఆ మినహాయింపును దుర్వినియోగం చేస్తూ అన్ని రకాల మందులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాటిని అదే పనిగా వినియోగిస్తే మానవ శరీరం వాటికి అలవాటుపడిపోతుంది. కొన్ని రోజులకు అంతకు మించిన డోసు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నేళ్లకు పూర్తిగా యాంటిబయోటిక్స్‌కు స్పందించడమే మానేస్తుందని తద్వారా వ్యక్తి ఆరోగ్యాన్ని హరించివేస్తుందని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు ఆరోగ్యశాఖకు సమర్పించిన నివేదికలో పొందుపర్చింది. కాంబినేషన్ మందులు వాడితే రోగం త్వరగా తగ్గొచ్చు. కానీ దీర్ఘకాలంలో హానీ చేస్తాయి. ప్రైవేటు వైద్యులు వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. వైద్యులు స్వీయ నియంత్రణ పాటిస్తే మేలు జరుగుతుంది.కంపెనీల విస్తృత ప్రచారంతో ఆ పేర్లన్నీ ప్రజల్లోకి వెళ్లాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లోని చదువుకున్నా, వైద్యంపై కనీస అవగాహన ఉన్నా ప్రజలు వాటి పేర్లు చెప్పి మరీ కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ఆయాసం ఇలా రోగాల పేర్లు చెప్పి మందులు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధీకృత దుకాణాలు లేకపోవడంతో కిరాణ దుకాణాలు, బడ్డి దుకాణాల్లో వీటి విక్రయాలకు అడ్డాగా మారాయి. ఏజెన్సీలే నేరుగా గ్రామాలకు వెళ్లి విక్రయిస్తున్నాయి. ఆర్‌ఎంపిలు, పిఎంపిలు సైతం వీటి వాడకానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా ప్రతి నెల కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో అన్ని దుకాణాలకు కేవలం సమాచారం ఇచ్చి వదిలేస్తున్నారు. జిల్లా పరిధిలో వందల కొద్ది దుకాణాలను తనిఖీ చేయడానికే నెలల సమయం పడుతుంది. మరో వైపు గ్రామాల్లో తిష్టవేసిన విక్రయాల జాడ్యం పై దృష్టిపెట్టే అవకాశమే లేదు. దీంతో నిషేధం అమలు జరిగేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.