శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం
ప్రధాన కల్యాణకట్ట (న్యూస్ పల్స్) నిత్యం గోవిందనామస్మరణలో మారుమ్రోగే తిరుమలగిరులకు అశేషంగా భక్తకోటి తరలివస్తుంటుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడిని కనులారా వీక్షించి, మొక్కులు చెల్లించుకోవాలని ప్రతి భక్తుడు తపనపడుతుంటాడు. ప్రత్యేకించీ శ్రీవారికి తలనీలాల మొక్కును చెల్లించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఆబాలగోపాలం ఎంతో భక్తితో తమ తలనీలాలను శ్రీనివాసుడికి సమర్పించి, స్వామివారి నిండైన దీవెనలను మనసు నిండా స్వీకరించి సంతృప్తిగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తారు. ఈ నేపథ్యంలో భక్తులు సులభంగా తలనీలాలను స్వామివారికి సమర్పించేలా, పరిశుభ్ర వాతావరణంలో సకల వసతులతో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రధాన కల్యాణకట్ట భక్తులకు ఎంతో ఉపకయుక్తంగా మారింది.అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆనందనిలయంలో వేంచేసి ఆర్తుల మొక్కులను అందుకుంటున్నాడు. క్షణకాలం ఆ పరంధాముడిని తనివితీరా వీక్షించి వేవేల కీర్తించి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆధ్యాత్మిక ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. భక్తకోటి హృదయాంతరంగం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, శ్రీనివాసుడిని మనసారా సేవించే ఆ మహద్భాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతుంటుంది భక్తుల హృదయం. తిరుమల యాత్రకు వెళ్ళడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకునే భక్తులు ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైన తలనీలాలను కానుకగా సమర్పించి, మొక్కులు చెల్లించుకోవడం సత్సంప్రదాయంగా వస్తోంది.
ఈ నేపథ్యంలోనే భక్తుల మొక్కులకు అనుగుణంగా తిరుమల క్షేత్రంలో పలు సౌకర్యాలను విస్తృతంగా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టితో ఆ స్వామివారి కరుణావీక్షణాలను అందుకోవడానికి వచ్చిన అశేష భక్తకోటికి ఎక్కడా ఏ లోటు లేకుండా సేవలను అందించడానికి ఎంతో తపనతో పరితపిస్తుంటుంది టిటిడి. ఇందులో భాగంగా ఎందరో భక్తులు ఓ పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ప్రధానంగా శ్రీవారికి తలనీలాలను సమర్పించేవిధంగా టిటిడి ప్రధాన కల్యాణకట్టను సకల సౌకర్యాలతో సమున్నతంగా తీర్చిదిద్దింది. తొలిరోజుల్లో ఆలయానికి ఆగ్నేయదిక్కున ఉన్న రావిచెట్టుకింద భక్తులు తమ తలనీలాలను సమర్పించేవారు. టిటిడి ఏర్పడిన తర్వాత రావిచెట్టు సమీపంలో అన్ని వసతులతో ఇప్పుడున్న ప్రధాన కల్యాణకట్టను నిర్మించింది. ఈ కల్యాణకట్టలోనే ఎక్కువమంది భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల మందివరకు భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. అదే శెలవు రోజులు ప్రత్యేక పర్వదినాలలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కల్యాణకట్టలో గంటలకు వెయ్యి నుంచి 1500 మంది భక్తులు తలనీలాలను సమర్పించే సదుపాయం ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు ఇక్కడే స్నానం చేయడానికి పురుషులు, మహిళలకు విడివిడిగా స్నానపు గదులను ఏర్పాటు చేసింది. 24గంటలు వేడినీటి సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇటీవల ప్రధాన కల్యాణకట్టను మరిన్ని వసతులతో ఆధునికీకరించారు. గాలి, వెలుతురు సక్రమంగా వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. తలనీలాల సమర్పణ కోసం వేచిఉండే భక్తులు విశ్రాంతిగా కూర్చోడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి ఎప్పటికప్పుడు వేడివేడిగా పాలు, కాఫీ, టీలతో పాటు, చల్లని తాగునీరు, మజ్జిగలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఇక తలనీలాల సమర్పణ విషయానికి వస్తే తలనీలాలను తీసేందుకు వృత్తినైపుణ్యం కలిగిన సుశిక్షుతులైన క్షురకులను టిటిడి నియమించింది. ఆడవారి కోసం.. మహిళా క్షురకులను కూడా టిటిడి నియమిచింది. తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తుంటారు. భక్తులు సమర్పించే తలనీలాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. వాటిని తలనీలాల హుండీలో వేస్తారు. అలాగే భక్తులకు ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా డిస్పోజబుల్ బ్లేడ్‌లను ఉపయోగిస్తున్నారు.