YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అన్నదాతకు కల్తీ కాటు

అన్నదాతకు కల్తీ కాటు

అన్నదాతకు కల్తీ కాటు (పశ్చిమగోదావరి)
ఏలూరు, అక్టోబర్ 03 : జిల్లా వ్యాప్తంగా కల్తీ ఎరువులు, వేపపిండి, క్రిమిసంహారక మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం అన్ని చోట్లా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు అవసరమైన ఎరువులు, మందులను కొనుగోలు చేసి పంటలకు వేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో రైతులకు తక్కువ ధర పేరిట కల్తీ ఎరువులను వ్యాపారులు అంటగడుతున్నట్లు సమాచారం. ఎరువులు, పురుగుమందుల వ్యాపారులు ఏటా ఆయా మండలాల వ్యవసాయాధికారి నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. జూన్‌ నెలలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయంలో అధికారులు దుకాణాలను పరిశీలించిన తరువాత అనుమతులు మంజూరు చేయాలి. కానీ అధికారులకు అంత తీరిక లేకపోవడం వల్ల దుకాణదారుల దస్త్రాలను కార్యాలయాలకే తెప్పించుకుని సంతకాలు చేసి పంపడం ఆనవాయితీగా మారింది. దుకాణాలపై విజిలెన్సు దాడులు జరిగినప్పుడు మాత్రం నామమాత్రపు చర్యలు, కేసులతో సరిపెడుతున్నారు. రైతులను నిట్టనిలువునా ముంచుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు.
మాకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందులు దుకాణాలపై దాడులు చేస్తూనే ఉన్నాం. చాలా దుకాణాల్లో నిల్వలు, దస్త్రాల్లో పొందుపరిచిన వివరాలకు వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవల ఆరుగొలనులో రెండు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిల్వల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించాం. ఆ దుకాణాలను సీజ్‌ చేసి వ్యవసాయశాఖాధికారులకు అప్పగించాం. బయో మందుల పేరిట కొందరు వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారు. రైతులు ఇలాంటి వారిని నమ్మకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలి. కల్తీ ఎరువులు, పురుగుల మందుల విక్రయాలను అరికట్టేలా జిల్లా వ్యాప్తంగా దాడులను ముమ్మరం చేస్తాం. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి ఎరువులు దిగుమతి అవుతాయి. ఇక్కడి నుంచి డీలర్లు దుకాణదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే కొందరు అక్రమార్కులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలైన బస్తాలను పక్కన పెట్టి ఎరువులో మట్టి, రాళ్లు, ఇసుక, ఉప్పు కలిపి కల్తీ చేసిన బస్తాలను రవాణా చేస్తున్నారు. ఎరువుల బస్తా ధర రూ.1200గా ఉంటే డీలర్లు నకిలీ సరకును రూ.600కే వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారికి, ఎరువులు అరువు పద్ధతిపై తీసుకునే రైతులకు వీటిని అంటగడుతున్నారు. వాస్తవానికి దుకాణాల్లో ఉంటే ఎరువుల నిల్వలకు, దస్త్రాల్లో నమోదు చేసే వివరాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా జరిపిన విజిలెన్సు దాడుల్లో ఇదే విషయం తేటతెల్లమైంది. డీలర్ల నుంచి బిల్లు ప్రకారం కొనుగోలు చేసిన స్టాకును మాత్రమే రికార్డుల్లో పొందుపరుస్తున్నారు. మిగిలిన బస్తాలను ముందుగా విక్రయించేస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం నకిలీ ఎరువులు ఉంటున్నాయి. ఈ తరహా వ్యాపారం జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా సాగుతోంది.

Related Posts