YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

నగరంలో ల్యాండ్ మాఫియా (కరీంనగర్)

నగరంలో ల్యాండ్ మాఫియా (కరీంనగర్)

నగరంలో ల్యాండ్ మాఫియా (కరీంనగర్)
కరీంనగర్, అక్టోబర్ 03 : ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమేనా.. తిరిగి స్వాధీనం చేసుకుని లక్షిత వర్గాలకు చేర్చుతుందా..నన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సర్కారు భూములున్నాయా.. లేదా..? పరిశీలించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు అంతకుముందు గుర్తించిన ప్రభుత్వ భూములపై నిశిత పరిశీలనకు నడుం కట్టింది. గతంలో నిర్వహించిన సర్వేతో 1200 ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతమైందని తేలగా సదరు వ్యవహారాన్ని ఎటూ తేల్చని యంత్రాంగం దస్త్రాల దుమ్ము దులిపేందుకు సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు లక్షిత వర్గాలకు పంపిణీ చేసిన భూమి వివరాలతో పాటు అందుబాటులో ఉన్న భూములను వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
వివరాల సేకరణకే పరిమితం కాకుండా ఉన్న భూములను కాపాడేందుకు కంచెలు ఏర్పాటు చేసేలా, పర్యవేక్షణ పక్కాగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుందని అధికార వర్గాలు చెబుతుండగా అందులో 21 వేల ఎకరాలను భూమిలేని పేదలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1218 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు గతంలో తేల్చింది. కాగా పేదలకు కేటాయించిన భూముల్లో చాలావరకు చేతులు మారాయి. మరికొన్ని చోట్ల నగరీకరణ నేపథ్యంలో జనావాసాలు పుట్టుకొచ్చాయి. ఇవేకాకుండా మరిన్ని కేటగిరీల కింద వర్గీకరించిన భూములు పరాధీనమయ్యాయి. ఈ క్రమంలో ఆక్రమితుల వివరాలు, విస్తీర్ణం కూడా పొందుపర్చాలని తేల్చి చెప్పింది. దీంతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన భూముల సమాచారాన్ని రాబట్టే పనిలో తలమునకలైంది. కాగా అన్యాక్రాంతమైన అసైన్డు భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పలువురు తహసీల్దార్లు ప్రభుత్వ భూములను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపి ఇతరుల ద్వారా పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆక్రమణలకు సహకరించినట్లు పక్కా సమాచారం..
లబ్ధిదారుల్లో నిరుపేదలు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులుండగా భూముల విలువలు పెరగడంతో సగానికి పైగా భూములు ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. పీవోటీ చట్టం ప్రకారం అసైన్డు భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదు. అయినప్పటికీ లోపాయికారి ఒప్పందాలు రిజిస్ట్రేషన్లతో భూముల క్రయవిక్రయాలు భారీగానే జరిగాయి. సర్కారు ఆదేశాలతో అసైన్డు భూములను అక్రమంగా కలిగి ఉన్న వారికి లావోణి భూముల నిషేధం రూల్స్‌ 2007 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదో సమాధానం కోరుతున్నారు. క్రయవిక్రయాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, రిజిస్ట్రేషన్లలో చేతివాటంతో చాలావరకు భూములు అమ్ముకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. భూ మాఫియా చేతుల్లోకి కొంత వెళ్లగా మరికొంత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కొనుగోలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అసైన్డు భూముల్లో నిర్మాణాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధిత రెవెన్యూ అధికారులు దన్నుగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. 1958 నుంచి 2008 ఫిబ్రవరి 8 వరకు అసైన్డుభూములు వేరే వ్యక్తి కొన్నట్లయితే, ఆ కుటుంబం నిరుపేదలైతే వారికే వర్తింపజేసేలా అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. జిల్లావ్యాప్తంగా 8వేల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్లు సమాచారం. అన్యాక్రాంతమైన.. ఇతరులకు విక్రయించిన అసైన్డుభూముల వివరాల సమాచారం రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అసైన్డు భూములను పహాణీలో పేరు మార్చి కొత్త పాస్‌బుక్కులు జారీ చేసిన సంఘటనలున్నాయి. అందుకు రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. లోతుగా విచారణ చేస్తే ఈ విషయాలు బయటపడనున్నాయి.

Related Posts