YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మద్యం పంట పండింది

మద్యం పంట పండింది

మద్యం పంట పండింది (నెల్లూరు)
నెల్లూరు, అక్టోబర్ 03 : ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు ఎక్సైజు శాఖకు కాసులు పండిస్తుంది. అద్దెకు ఇళ్లు తీసుకునే ప్రక్రియ నుంచి ఉద్యోగుల నియామకం, దుకాణాల ఏర్పాటుకు భవనాల పరిశీలన, ఫర్నిచర్‌ కొనుగోళ్లలో అందినకాడికి దోచేశారు. జిల్లాలో 15 సర్కిళ్ల పరిధిలో కొంతమంది ముందస్తు ఒప్పందాలతో మార్కెట్‌లో రూ.5 వేల రేటు లేని ఇళ్లకు రూ.పదివేలకుపైనే అద్దెకు ఇచ్చేశారు. సిఫార్సులకు తలొగ్గి అనేక ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు పెంచేశారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలకు అత్యధిక అద్దె చెల్లిస్తున్నారు. జిల్లా కేంద్రం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని నిరసనలు చేపట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎక్సైజు అధికారులు పట్టించుకోలేదు.
జనావాసాల మధ్య ఎటువంటి వ్యతిరేకత, ఫిర్యాదులు ఉన్నా మద్యం దుకాణం వేరే ప్రాంతంలోకి మార్చాలనే మార్గదర్శకాలు ఉన్నా ఎక్సైజుశాఖ వీటిని అయినవారి కోసమే వినియోగిస్తున్నారు. జిల్లాలో 230 మద్యం దుకాణాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మద్యం దుకాణంలో సేల్స్‌ సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌ల నియామకం, ఫర్నిచర్‌ కొనుగోలు, అద్దె ఇళ్లు తీసుకోవడం పూర్తి చేశారు. ప్రతి పనిలో ఎక్సైజు శాఖకు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉన్న లొసుగులతో ఎవరికివారు కేటాయింపులు చేసి పనులు పూర్తిచేసేశారు. ఫర్నిచర్‌ కొనుగోలు చేసే సమయంలో సరఫరాదారు జీఎస్టీ నెంబరు కచ్చితంగా ఉండాలనే నిబంధన ఉంది. కొనుగోలు చేసే ప్రతివస్తువు ధరలో ఇన్‌పుట్‌ పన్ను తిరిగి చెల్లింపు జరుగుతుంది. వీటిని పక్కన పెట్టిన బెవరేజస్‌ అధికారులు, కొనుగోళ్లు అయినవారికి కట్టబెట్టారు. ఐరన్‌ ర్యాకులు 5 లేదా 6 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే దుకాణాల్లో కనిపిస్తున్నాయి. ప్రతి దుకాణంలో నాలుగు కుర్చీలకు బదులు మూడుకు తగ్గించేశారు. ఈ తరహా కుదింపు పరిశీలనాధికారులకు కాసులు వచ్చాయి.
జిల్లా కేంద్రంలో బార్‌ల నిర్వాహకులు భారీగానే పెత్తనం చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రస్తుతం పర్మిట్‌ గది, కూలర్లు లేకపోవడంతో మద్యం తాగేందుకు అక్టోబరు 1 నుంచి బార్‌లకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందనే అంచనాతో నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో బార్‌లకు సమీపంలో మద్యం దుకాణం ఆచూకీ కనిపించకుండా ముడుపులతో పెత్తనం చేశారు. స్థానిక స్టేషన్‌ అధికారులతో ఉన్న ఒప్పందాల్లో రూ. లక్షలు చేతులు మారాయనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరాయి. బార్‌లకు సమీపంలో ఎక్కడా మద్యం అమ్మకాలు లేకుండా చేయాలనే సిండికేట్ల ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించింది. గత మాసంలో ఏర్పాటు అయిన 50 మద్యం దుకాణాలు బార్‌లకు సమీపంలో లేకుండా చేశారు.

Related Posts