పనులు అధ్వాన్నం.. అవస్థలు అనంతం (కామారెడ్డి)
కామారెడ్డి, అక్టోబర్ 03 : జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవల చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజా ధనాన్ని సక్రమంగా ఖర్చు చేయాల్సిన యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆయా పథకాల కింద పట్టణంలో చేపట్టే పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడి పరిస్థితి గాడి తప్పుతోంది. పాలకవర్గం గడువు ముగిశాకా గతంలో ఆమోదించిన పనులను ఇష్టారాజ్యంగా చేపట్టి నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో 33 వార్డులుండగా కొత్తగా 16 వార్డులను విభజించారు. శివారు ప్రాంతాల్లో అధికంగా పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదే అనువుగా లక్షలాది రూపాయల నిధులను శివారు వార్డులకు కేటాయించారు. వార్డుల్లో చేపట్టే పనులను మూడు కాలాల పాటు మన్నికగా ఉండాల్సింది పోయి అనతి కాలంలోనే కంకర తేలి గుంతలుగా మారుతున్నాయి. పలు చోట్ల సిమెంట్ సక్రమంగా కలపక రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించి వదిలేశారు. రోడ్డుకిరువైపులా ఎత్తు ఎక్కువగా ఉంది. మొరం పోసి చదును చేయాల్సిన కాంట్రాక్టర్లు నెలల తరబడి పట్టించుకోవడం లేదు. పాలకవర్గ హయాంలో సాధారణ నిధుల నుంచి విచ్చలవిడిగా పనులు చేపట్టారు. సుమారు రూ.10 కోట్ల పనులను ఆదాయ, వ్యయాలను సమీక్షించకుండానే పని కానిచ్చారు. అభివృద్ధి పనులు బినామీ కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన పనులు పగుళ్లు బారి, గుంతలు పడి రాకపోకలకు నరకప్రాయంగా మారాయి. కాంట్రాక్టర్లు కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. అధికారులు వంతపాడారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు గాలిలో కలిసిపోయాయి. నిధులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. నిబంధనల మేరకు జరగాల్సిన పనులు పక్కదారి పట్టడం గమనార్హం. జిల్లా కేంద్రంలో వికాస్‌నగర్, అశోక్‌నగర్, విద్యానగర్, ఎన్జీవోస్‌కాలనీ, సైలన్‌బాబాకాలనీ, పంచముఖి హనుమాన్‌కాలనీ, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లో
ప్రగతి పనులు చేపట్టారు. సీసీ రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పలు వార్డుల్లో రూ. 8 కోట్లకు పైగా ప్రగతి పనులు నిర్వహించారు. ప్రస్తుతం వివిధ కాలనీల్లో రోడ్లను పరిశీలిస్తే పగుళ్లు బారి కనిపిస్తున్నాయి. కంకర తేలి నాసిరకం పనులను వేలెత్తి చూపుతున్నాయి. వర్షం కురిసిందంటే చాలు ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన పనుల తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. పాలకవర్గం గడువు ముగిశాకా పనుల తీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది.