విచారణ శూన్యం (విజయనగరం)
విజయనగరం, అక్టోబర్ 03 : గిరిజన సహకార సంస్థలో జరిగిన అక్రమాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యుగోలు నియామకాలపై దర్యాప్తు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి ఆదేశించారు. దీంతో గతంలో ఈ సంస్థలో నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించిన ఫలితాలపై నిగ్గుతేల్చే పని ప్రారంభమవుతున్నట్లు భావించొచ్ఛు అయితే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే జీసీసీ నిర్వాకాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అక్రమార్కులను కొనసాగించేందుకు తెరచాటు వ్యవహారాలు నడుస్తున్నాయనే విమర్శలున్నాయి. పార్వతీపురం డివిజనులో టెండర్ల ప్రక్రియలో అక్రమాలు కంపు కొడుతున్నాయి. ఎక్కడా లేని విధంగా టెలిఫోను టెండర్లు నిర్వహించిన అధికారికి అధికార పక్షానికి చెందిన వారే కాపుకాస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. లక్షలాది రూపాయల కొనుగోళ్లలో పారదర్శకత పాటించకుండా ఫోనుచాటు వ్యవహారాలు నడిపిన ఉద్యోగి ఇంకా ఇక్కడ కొనసాగుతున్నారంటే అది ఏలిన వారి చలవే అనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు స్వయంగా డీడీఆర్సీలో జీసీసీ టెండర్లలో డొల్లతనాన్ని, జరుగుతున్న విధానాన్ని బయటపెట్టారు. దీనిపై విచారణకు ఆదేశించి, చివరకు వాస్తవాలు బయటపడినా, చర్యలకు మాత్రం చేతులు రాని పరిస్థితి పార్వతీపురం డివిజనులో నెలకొంది.
ప్రతినెలా ఏఏ సరకులు ఎంతెంత అవసరమనే విషయాన్ని తెలుసుకొని ఆమేరకు సరకులను డివిజను స్థాయిలో కొనుగోలు చేయాలి. బ్రాంచి మేనేజర్లు నుంచి వచ్చిన అంచనాలు, అవసరాలను లెక్కలోకి తీసుకోకుండా ఉప్పును అవసరానికి మించి కొనుగోలు చేశారనే ఆరోపణలు దర్యాప్తు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనికి కారణం అడిగితే ఎక్కువ పరిణామంలో ఉప్పు కొనుగోలు చేస్తే ధర తగ్గుతుందని చెప్పుకొచ్చారు. ఉప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోతుందని, దీనికి ఎవరు సమాధానం చెబుతారనే ప్రశ్నలకు సమాధానం లేదు. వీరికి అణాపైసలతో పాటుగా చెల్లింపులు నిమిషాలపై జరిగిపోయాయి. విడత వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఏ ప్రాతిపదికన ఒకేసారి చెల్లించారనే ప్రశ్నకు సమాధానం లేదు. పార్వతీపురం డివిజనులోని వైభోగం ఇలా ఉంటే చర్యలు ఊసు లేదు. మంత్రి సొంత ప్రాంతంలోనే గిరిజన సహకార సంస్థ పనితీరుపై మౌనరాగం ఆలపిస్తుంటే మరి సంస్థను గట్టెక్కించేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐటీడీఏలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు గుడ్లు సరఫరా టెండర్లు రద్దు చేసినట్లు ప్రకటించినా, తిరిగి ఆయా సరఫరాదారులే గుడ్లును పాఠశాలలకు అందిస్తున్నారు. దీనికి కారణమేమిటని ప్రశ్నిస్తే టెండర్లు ఖరారు అయ్యేంత వరకు పాత సరఫరాదారులే గుడ్లు అందించాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొంటున్నారు. అంటే పాతధరకే గుడ్లను మళ్లీ వారే సరఫరా చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. వసతిగృహాల నిర్వాహకులకు, సరఫరాదారులకు ఉన్న లోపకారి ఒప్పందాల వల్ల గుడ్లు సరఫరా కూడా పూర్తి స్థాయిలో జరగడంలేదనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ జీసీసీయే కేంద్ర బిందువుగా మారుతోంది.