ఈఎస్ఐ స్కాంలో పెద్ద తిమింగళాలు
హైద్రాబాద్, అక్టోబరు 3,
ఈఎస్‌ఐ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన నాలుగేళ్ళలో రూ. 1000 కోట్ల మేర మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు రూ. 250కోట్ల మందులు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా.. పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కాంలో మొత్తం 8 మందిని అరెస్టు చేయగా, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇక దర్యాప్తులో భాగంగా బుధవారం ఓమ్ని మెడి ఉద్యోగి నాగరాజుల ఇంట్లో రూ. 46 కోట్ల నకిలీ ఇండెంట్లు దొరకడంతో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దొరికిన నకీలి ఇండెట్లపై పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల ఇళ్లతో పాటు పలు అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి ఈ రోజు లేదా రేపు మరికొంత మంది అరెస్టుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.