వైసీపీలోకి కిల్లీ
శ్రీకాకుళం, అక్టోబరు 4,
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో జగన్ సామాజిక వర్గ సమీకరణ టీడీపీకి సవాల్ చేసేలా ఉంది. టీడీపీ హయాంలో వెలమ సామాజికవర్గానికే పెద్ద పీట వేసింది. నాడు అన్ని విధాలుగా అణగారిపోయిన బలమైన కాళింగ సామాజికవర్గాన్ని చేరదీయడం ద్వారా జగన్ సార్వత్రిక ఎన్నికలో మంచి విజయం సాధించారు. ఇపుడు మరింత ముందుకు వెళ్ళి ఆ వర్గానికి రాజకీయంగా భారీ అవకాశాలు అందించడం ద్వారా పట్టుపెంచుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంని ట్రంప్ కార్డ్ గా ఉపయోగించుకుంటున్నారు. తమ్మినేని నిజాయతి, విశ్వసనీయత కలిగిన రాజకీయాలు చేస్తారని పేరు. జగన్ ఈ పెద్దాయన్ని నమ్మి రాజ్యాంగబద్దమైన పదవిని కట్టబెట్టారు. తమ్మినేని సైతం రాజకీయాలను తన పరిధి దాటకుండా చేసుకువస్తూ సిక్కోలులో వైసీపీ పట్టుని పెంచుతున్నారు.ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఆమె ఎన్నికల ముందు వైసీపీలో చేరింది. ఆమెకు అప్పట్లో సీట్ల సర్దుబాటు మూలంగా అవకాశం ఇవ్వలేకపోయిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి వైఎస్సార్ పొలిటికల్ డిస్కవరీ. వైద్యురాలిగా సిక్కోలులో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వైఎస్సార్ చలువతో 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో ఏకంగా కింజరపు ఎర్రన్నాయుడునే ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఆ తరువాత కాలంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి సమర్ధురాలిగా నిరూపించుకున్నారు.ఇలా కిల్లి కృపారాణికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సిక్కోలు రాజకీయాల్లో జగన్ వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టాలనుకుంటున్నారు. టీడీపీలో కింజరపు, కాంగ్రెస్, వైసీపీలో ధర్మాన కుటుంబాలే రాజకీయాల్లో భారీ వాటాను సొంతం చేసుకుని దశాబ్దాలుగా రాజ్యం చేస్తున్నాయి. అందుకే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండ కొంత ఆధిపత్యం తగ్గించిన జగన్ ఆయన సోదరుడు క్రిష్ణదాస్ ని మంత్రిని చేసారు.రానున్న రోజుల్లో కిల్లి కృపారాణికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా జిల్లా రాజకీయాలను బ్యాలన్స్ చేస్తారని అంటున్నారు. కిల్లి క్రుపారాణి ధాటిగా ఢిల్లీ రాజకీయాల్లో దూసుకుపోతారని, ఆమెకు ఉన్న పరిచయాలతో పార్టీకి ఎలివేషన్ వస్తుందని జగన్ నమ్ముతున్నారు. ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన ఇద్దరూ అగ్ర వర్ణాల వారే. ఇపుడు ఉత్తరాంధ్రకు చెందిన బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గానికి కూడా మంచి సంకేతాలు పంపినట్లు అవుతుందని భావిస్తున్నరు. ఇక కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి జగన్ ప్రత్యేకంగా విశాఖ రావడం అంటే ఆమె పట్ల ఆయనకు మంచి అభిప్రాయం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.