రైతుల ‘లాంగ్‌మార్చ్’ వెనక ఉన్నది ఎవరు? ఆయన కథేంటి? నాసిక్ నుంచి ముంబై వరకు ఆయన ఆధ్వర్యంలో అశేషమైన రైతులు నిర్వహించిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పేద, ఆదివాసీ రైతులు తమ హక్కుల కోసం గర్జిస్తూ. 180 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ లాంగ్‌మార్చ్ విజయవంతమైంది. తమ హక్కుల కోసం పోరాడేందుకు రైతులందరినీ ఏకతాటికి తెచ్చిన విజూ కృష్ణన్.. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాయింట్ సెక్రటరీ. కేరళలోని కన్నూర్ జిల్లా కరివెల్లూరు విజూ స్వగ్రామం. ఇక్కడి రైతులే 1946లో బ్రిటిష్ పాలకులకు ఎదురుతిరిగి.. తమ హక్కులకై పోరాటం చేశారు. ఇక్కడి రైతుపోరాటాలను, అన్నదాతల కష్టనష్టాలను వింటూ పెరిగిన విజూ కృష్ణన్.. గతంలో జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఫైర్‌బ్రాండ్ నేతగా పేరొందిన విజూ.. ప్రస్తుతం ఏఐకేఎస్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతూ... రైతుల ‘లాంగ్‌మార్చ్’లో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సీపీఎం సెంట్రల్ కమిటీలో అత్యంత పిన్నవయస్సు సభ్యుడు ఆయనే. ప్రత్యేక ఆహ్వానితుడిగా సెంట్రల్ కమిటీలో ఆయన సేవలు అందిస్తున్నారు. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మార్పులపై డాక్టరేట్ చేసిన ఆయన.. బెంగుళూరు సెయింట్ జోసెఫ్ కాలేజీ పీజీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా కొన్నాళ్లు పనిచేసి.. అనంతరం రైతు కార్యకర్తగా సేవలు అందించేందుకు ఉద్యోగాన్ని వదిలేశారు.