సరస్వతి దర్శనానికి భారీ ఏర్పాట్లె
విజయవాడ, అక్టోబరు 4, )
సరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం రోజున భక్తుల దర్శనాలు అధికారులకు సవాల్‌గా మారనున్నాయి. ఈ నెల 5వ తేదీన మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవిగా దర్శన మిస్తుండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ రోజున అమ్మవారిని దర్శించుకుంటే విద్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మిక. దీంతో ముందురోజు సాయంత్రం నుంచే భారీగా భక్తులు తమ పిల్లలతో తరలివస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షలకు పైగా రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వారాంతం కావడం, మర్నాడు ఆదివారం కావడంతో ఎక్కువ మంది తరలివస్తారని భావిస్తున్నారు. ముందు రోజు సాయంత్రానికే క్యూలైన్లలో నిలబడేందుకు వచ్చే భక్తులను ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాంతంలో భక్తులను నిలిపి ఉంచేందుకు హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తారు. క్యూలైన్లు, ఆలయం వద్ద రద్దీని నియంత్రించేందుకు ఈ పాయింట్ నుంచి భక్తులను బ్యాచ్‌లుగా అనుమతిస్తారు. అయితే నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో హోల్డింగ్ పాయింట్‌గా ప్రతిపాదించిన ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి సామగ్రి ఉంది. దీంతో అక్కడ భక్తులను నిలిపి ఉంచడం కష్టసాధ్యంగా మారనుంది. ఇది పోలీసులకు సవాల్‌గా మారుతుందనవచ్చు. ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల రాకపోకల నియంత్రణ వల్ల నగర ప్రజలు కొంత ఇబ్బందులకు గురి అవుతున్నారు. పైగా మూలా నక్షత్రం రోజునే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి కూడా వస్తుండటంతో భక్తుల కష్టాలు మరింత ఎక్కువ అవుతాయనవచ్చు. అధికారగణం మరింత సమన్వయంతో పని చేయకపోతే భక్తుల ఇక్కట్లు మరింత ఎక్కువ అవుతాయి.