కన్నడ కమలంలో వర్గవిభేధాలు
బెంగళూర్, అక్టోబరు 4,
కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటగానే కన్పిస్తుంది. కర్ణాటక భారతీయ జనతా పార్టీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే వర్గ విభేదాలు మరింత ముదిరే అవకాశముంది. ఉప ఎన్నికలు పార్టీలో చిచ్చుపెట్టే అవకాశాలే ఎక్కువ కన్పిస్తున్నాయి. ఇప్పటికే యడ్యూరప్ప ఒంటరి వారయ్యారు. అధిష్టానం సయితం యడ్యూరప్పకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. మరోవైపు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ కు , యడ్యూరప్ప కు పొసగడం లేదు. యడ్యూరప్పపై అసంతృప్తితో ఉన్న నేతలు నళిన్ కుమార్ వైపు జట్టుకడుతున్నారు.ఇదిలా ఉండగానే పదిహేను నియోజకవర్గాల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే టిక్కెట్లు కేటాయిస్తామని యడ్యూరప్ప చెప్పడం కూడా పార్టీలో మరింత వేడిని రాజేసింది. గత కొన్నాళ్లుగా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై బీజేపీ నేతలు తలా ఒక మాట అనేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు కాకుండా నిన్న గాక మొన్న వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పముఖ్యమంత్రి సయితం అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై నోరు జారారు. వారు దరిద్రులంటూ ఆయన అనడం వివాదాస్పదమయింది.అయితే యడ్యూరప్ప ఈ తికమకకు రదించారు. పదిహేను మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం పార్టీలో నిప్పు రాజేసింది. ఇది తన నిర్ణయం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫైనల్ డెసిషన్ చెప్పారు. అయినా బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ నాయకత్వం కూడా తమకు అన్యాయం చేయదన్న విశ్వాసంతో న్నారు.ఉపఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటిస్తే బీజేపీ స్థానిక నేతలు సహకరించే పరిస్థితి లేదు. ఇటీవల జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేసినా క్యాడర్ కలవకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల నాటికి అసంతృప్తిని చల్లార్చగననే ధీమాతో యడ్యూరప్ప ఉన్నారు. కానీ అసమ్మతి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు పంపుతున్నారు. ఇదే అసంతృప్తి బీజేపీలో కొనసాగితే ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమేనని చెప్పక తప్పదు. దీంతో యడ్యూరప్ప సర్కార్ కుప్ప కూలిపోవడం ఖాయం. రాష్ట్రపతిపాలన రావడం ఖాయం.