రాజ్ ధాక్రే... చావో, రేవో
ముంబై, అక్టోబరు 4,
రాజ్ థాక్రే… శివసేన నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకుని మహారాష్ట్రలో సంచలనం సృష్టించారు. బాల్ థాక్రేను తానే సిసలైన వారసుడినంటూ రాజ్ థాక్రే ప్రకటించకపోయినా కొందరు మాత్రం అలాగే గుర్తిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలు ఈనెలలోనే జరగనున్నాయి. రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేనను ఏర్పాటు చేసుకున్నారు. అయితే పార్టీ పెట్టిన తొలి నాళ్లలో కొంత మేర సక్సెస్ సాధించినా తర్వాత కాలంలో పెద్దగా అనుకూల ఫలితలను సాధించలేకపోయింది.గత అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పెద్దగా ప్రభావం చూపలేదు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రేకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించకపోతే ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. పార్టీని దీర్ఘకాలమూ నడపటమూ కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. అందుకే రాజ్ థాక్రే కనీసం ప్రభావితం చేయగలిగిన స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్నారు.నిజానికి రాజ్ థాక్రే సభలకు, సమావేశాలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతారు. ఆయన ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. కానీ అవి ఓట్ల రూపంలో మారడం లేదు. అందుకే గత దశాబ్దకాలంగా పార్టీని నడుపుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. దీంతో ఎంఎన్ఎస్ క్యాడర్ లోనూ అసంతృప్తి నెలకొంది. శివసేనతో విభేదాలుండటం వల్ల ఆయన ఏ పార్టీతో పొత్తుకు అంగీకరించడం లేదు. ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించారు.మహరాష్ట్రలో ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో 125 స్థానాల్లో పోటీ చేయాలని రాజ్ థాక్రే నిర్ణయించారు. ఎంఎన్ఎస్ కు కొన్ని ప్రాంతాల్లోనే పట్టుంది. ముంబయి, పూనే, పాల్ ఘర్, థానే, నాసిక్ తదితర ప్రాంతాల్లో కొంత ప్రభావం చూపగలుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లు రాజ్ థాక్రే కు అండగా నిలుస్తున్నారు. దీంతో కనీస స్థానాలను గెలుచుకుని తాను కింగ్ మేకర్ కావాలన్నది రాజ్ థాక్రే ఆకాంక్ష. మరి ఏం జరుగుతుందో చూడాలి.