మహాలక్ష్మీగా బెజవాడ దుర్గమ్మ
విజయవాడ, అక్టోబరు 4,
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపంలో అమ్మవారు అభయమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చింది అమ్మ.. ‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ లోకంలోని అన్ని ప్రాణుల్లో లక్ష్మీస్వరూపంలో ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు. సుఖంగా జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే.మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే క్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు గుతాయి.‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం’ శ్లోకంతో అమ్మవారిని ప్రార్థించాలి. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు.లక్ష్మీ స్వరూపానికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు. తమ సంతానానికి జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, కుటుంబానికంతటికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా... అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి. తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి పరమార్థం. పురుషుడు ఎంత ధనవంతుడైనా, భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది. ఎటువంటి సంతృప్తినీ అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద...ఇల్లాలు, ఆమె అందించే సహకారం మాత్రమే.