శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం
నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల
మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి. పూర్తిగా దట్టమైన
అడవిమధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంతదూరం చరిత్రలో ప్రయాణిస్తే... మనకు ముందుగా దొరికే
సమాధానం తరిగొండవెంగమాంబ.... అంతకుముందు ఎందరో రాజులు, చక్రవర్తులు, స్వామివారి నైవేద్యానికి భూరివిరాళాలు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే
భక్తులకోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది.
శ్రీవారి అపరభక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నపసాద వితరణ చేసినట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా
వైశాఖమాసంలో రుమలలో నృసింహజయంతి జరిపే వేంగమాంబ పదిరోజులపాటు అన్నప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటుచేసేదట. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు
దిండిగల్లు మొదలుకొని ఉత్తారాదిన
గోల్కొండవరకు ఎందరో భూదానాలు చేసినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాందిపలికిన తరిగొండ వేంగమాంబ పేరుతో టిటిడి నూతన
అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి నాలుగువేలమంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జులై 11వ తేదీన ఈ అన్నప్రసాద భవనాన్ని
అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభించారు. ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడుదశాబ్దాల తరువాత స్వల్పధరలకే అల్పాహారాన్ని అందించే ఓ
క్యాంటీన్‌ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామసంకీర్తన జరిగే మండపంలో ఈ టీన్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇడ్లీ 10పైసలు, వడ 15
పైసలు, టీ, కాఫీలు 25పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం పాయిపావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980వరకు ఏఎన్‌సి ప్రాంతంలోని ఓ కాటేజీలో
ఎస్వీసీసీ పేరుతో అంటే శ్రీవేంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్పధరలకే ఆహారపదార్థాలు విక్రయించేవారు.
తదుపరి 1971లో ప్రముఖులు, భక్తులకోసం మార్చి 31 1971లో ఎస్వీ గెస్ట్ హౌస్‌ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో
టీటీడీ ప్రత్యేకంగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేసి తక్కువ ధరలకు అల్పాహారాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకే భోజన సదుపాయాన్నీ కల్పించింది. తదుపరి 1981 నుంచి
1984వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోని టీటీడీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటుచేసిన ఇక్కడ ప్లేట్‌మీల్స్ రూపాయి 75పైసలకు, ఫుల్‌మీల్స్ మూడురూపాయలకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే
పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన అప్పటి ఇఓ పీవీఆర్‌కె ప్రసాద్ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్ మీల్స్ రూపాయి 75 పైసలు, ఫుల్‌మీల్స్
మూడురూపాయలు, స్పెషల్ భోజనం 4.50 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం ఐదువేల భోజనాలను విక్రయించేవారు.అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య
ఎప్పటికప్పుడు తుండటంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టిటిడి శ్రీకారం చుట్టింది. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వీ
రామయ్య అనే భక్తుడు ఇచ్చిన పదిలక్షలరూపాయల భూరివిరాళంతో టిటిడి ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచితభోజనం
లభించేది.
శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచితభోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండువేలమందికి మాత్రమే భోజనం అందిస్తుండగా క్రమంగా
ఈ సంఖ్య 14 వేలకు, అక్కడ నుంచి 20 వేల మందికి పెరిగింది. ఈ భవనంలో రెండు హాల్స్ ఉండటంతో ఒక్కో హాల్‌లో వెయ్యిమంది చొప్పున విడతకు రెండు వేల మంది భోజనం
చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతినిత్యం లక్షకు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి
తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది.