వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ
సమ్మె విరుద్ధం
హైద్రాబాద్, అక్టోబరు 4 :
తెలంగాణ దసరా చాలా పెద్ద పండుగ. పండుగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ శుక్రవారం కూడా చర్చలు జరిపింది. చర్చలు ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.ఆర్టీసీ కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. సమ్మె నివారణకు జరపాల్సిన చర్చలన్నీ జరిపాం. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు అవసరమైతే స్కూల్ బస్సులను కూడా నడుపుతామని చెప్పారు. అవసరమైన రక్షణ ఏర్పాటు చేసి ప్రయివేటు బస్సులు నడిపిస్తామన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం భావిస్తోంది. చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగితే చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాలు ధిక్కరించిన వారిని డిస్మిస్ చేసి కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ. 3,303 కోట్ల ఆర్థిక సాయం అందింది. మూడేళ్లుగా బడ్జెట్‌లో పెట్టిన దాని కంటే ఎక్కువ నిధులు ఆర్టీసీకి ఇచ్చాం. సమస్యలను లోతుగా పరిశీలించి పరిష్కరించేందుకు కమిటీ అధ్యయనం చేసింది. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నాం. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టి సంస్థపై చెడు అభిప్రాయం కలిగేలా చేయొద్దు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని సహాయం అడగడం సరికాదు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని ప్రైవేటు వాహనాలకు కూడా చెప్పామని సభ్యులు తెలిపారు.
సమ్మె విరుద్ధం