వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్
గ్రామ వలంటీర్లలలో అవినీతి ఆరోపణలు
విజయవాడ, అక్టోబరు 4 :
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏపీ సర్కారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండొద్దని, పథకాలు పారదర్శకంగా అమలు కావడం కోసం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉపకరిస్తుందనే జగన్ భావన. అందుకే 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున నియమించారు. వీరికి రూ. 5 వేల గౌరవ వేతనం అందించాలని నిర్ణయించారు.కానీ సర్కారు లక్ష్యం ఒకలా ఉంటే.. వాలంటీర్ల తీరు మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. లబ్ధిదారులకు అండగా ఉండాల్సిన వాలంటీర్లే.. అమ్యామ్యాల కోసం కక్కుర్తి పడ్డారు. దీంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఫించను నగదు అందగానే.. వాలంటీర్లు రంగంలోకి దిగారు. నలుగురు వాలంటీర్లు.. పింఛను లబ్ధిదారుల దగ్గరకెళ్లి దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి దగ్గర్నుంచి రూ.50 చొప్పున తీసుకున్నారు.కొందరు లబ్ధిదారులు మామూలు ఇవ్వడానికి నిరాకరించారు. పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన బందరు ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు. నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన వీఆర్‌ఏపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారుకు సూచించారు. గ్రామ వాలంటీర్లు ఉద్యోగాల్లో చేరి రెండు నెలలైనా గడవక ముందే మామూళ్ల దందాకు దిగడంతో.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.
గ్రామ వలంటీర్లలలో అవినీతి ఆరోపణలు