YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కలవర పెడుతున్న పట్టుగూళ్ల ధరలు 

కలవర పెడుతున్న పట్టుగూళ్ల ధరలు 

కలవర పెడుతున్న పట్టుగూళ్ల ధరలు 
అనంతపురం,  అక్టోబరు 5,
రోజురోజుకు పతనమవుతున్న పట్టుగూళ్ల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. కనీస మద్దతు ధర లభించకపోవడంతో రైతులు డీలా పడ్డారు. ధర రోజురోజుకు తగ్గుముఖం పట్టడం రైతున్నను కుంగతీస్తోంది. దీపావళి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయం తర్వాత అనంతపురం జిల్లాలో పట్టుపరిశ్రమపై రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. జిల్లాలోని దక్షిణ తాలూకాలైన హిందూపురం, మడకశిర, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో పట్టు పరిశ్రమపై ఆధారపడి వేలాది రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఏడాదికి కనీసం నాలుగు పంటలు పండించి జీవనోపాధి పొందుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో వాణిజ్య పంటగా పేరుగాంచిన వేరుశెనగ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నష్టపోయింది. దీనికి తోడు ప్రత్యామ్నాయ పంటలైన కంది, మొక్కజొన్న, ఉలవలు వంటి పంటలు కూడా చేతికి రాక రైతులు తల్లడిల్లిపోతున్నారు. దీంతో గత కొనే్నళ్లుగా చాలా మంది రైతులు పట్టు పంటసాగుపై మక్కువ చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పంట సాగు చేసే రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహాకాలు అందిస్తుండటంతో ఈ దిశగా రైతులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇకపోతే వివిధ పరిస్థితుల వల్ల పట్టుగూళ్ళ ధరలు కూడా కొద్ది రోజులుగా గణనీయంగా తగ్గిపోతుండటం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. వినాయక చవితి, దసరా పండుగల నేపథ్యంలో పట్టుచీరల తయారీ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆయా పండుగలతో కార్మికులు తమ విధులకు కనీస స్థాయిలో కూడా హాజరుకాకపోతుండటంతో పట్టుచీరల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ పరిణామం పరోక్షంగా పట్టుగూళ్ళ ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు బెంగళూరు కేంద్రంగా పట్టుగూళ్ళ ద్వారా తయారయ్యే రేషం రీలర్ల నుండి కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ వ్యాపారులు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. పట్టుగూళ్లను రీలర్లకు విక్రయించడం, రీలర్లు రేషం తయారు చేసి వ్యాపార వేత్తలకు విక్రయించడం, ఆ వ్యాపారవేత్తలు మరమగ్గాలు, చేనేత మగ్గాల నిర్వాహకులకు సరఫరా చేయడం పట్టుపరిశ్రమకు అనుబంధంగా కొనసాగుతుంటుంది. వ్యాపారవేత్తలు ఇప్పటికే తమ వద్ద నిలువ ఉన్న ముడి సరుకును విక్రయించిన తర్వాతే కొత్తగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో  నాలుగు రోజులుగా స్థానిక పట్టుగూళ్ళ విక్రయ కేంద్రంలో రీలర్లు కూడా పోటాపోటీగా ధరను కోడ్ చేయకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పట్టుగూళ్లు ఇప్పటికే తమ వద్ద పేరుకుపోయాయని, తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని రీలర్ల సంఘం ప్రతినిధి రియాజ్ వాపోయారు. దీపావళి దాకా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.ఇకపోతే ఈ-యాక్షన్ ద్వారా పట్టుగూళ్ళ ధరలను నిర్ణయిస్తుండగా బెంగళూరులో ఆయా వాణిజ్య కార్యకలాపాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా రీలర్లు ధరలను నిర్ణయిస్తున్నారు.ప్రధానంగా బెంగళూరులో రేషం కొనుగోలు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోవడంతో రీలర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక తక్కువ ధరకే పట్టుగూళ్ళను విక్రయించి నష్టపోవాల్సి వస్తోంది. బైవోల్టిన్ పట్టుగూళ్ల కనీస ధర రూ.200 నుండి రూ.350 లోపే ఉంటోంది. రైతులకు కనీసం కిలో రూ.400 పైబడి ధర లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. గత వారం రోజులుగా పట్టుగూళ్లు స్థానిక విక్రయ కేంద్రానికి గణనీయంగా వస్తున్నప్పటికీ ధర మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. గత నెల 25వ తేదీ బైవోల్టిన్ కనీస ధర రూ.200 కాగా సీబీ ధర రూ.158 మాత్రమే పలికింది. 26వ తేదీ కొంతమేర కనీస ధర పెరిగినప్పటికీ 27న మళ్లీ తగ్గుముఖం పట్టింది. 28వ తేదీ బైవోల్టిన్ ధర రూ.216 ఉండగా సీబీ ధర రూ.176 మాత్రమే పలికింది. మళ్లీ 29, 30వ తేదీల్లో మరింత తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈనెల 2, 3వ తేదీల్లో ఆ ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. బైవోల్టిన్ ధర కనీస ధర రూ.203 కాగా సగటున కేవలం రూ.308 మాత్రమే పలికింది. అదే విధంగా సీబీ ధర రూ.108 నుండి సగటున రూ.245కు మించి పలకలేదు.ఇకపోతే హిందూపురం పట్టుగూళ్ళ కేంద్రంలోనే 250 మందికి పైగా రీలర్లు పట్టుపరిశ్రమపై ఆధారపడి లావాదేవీలు సాగిస్తున్నారు. స్థానిక పట్టుగూళ్ళ విక్రయ కేంద్రానికి హిందూపురం, పెనుకొండ, మడకశిర, రొద్దం, లేపాక్షి, కుందుర్పి, అమరాపురం, రొళ్ళ, అగళి, గుడిబండ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ప్రతిరోజూ పట్టుగూళ్ళను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కర్నాటక పరిధిలోని శిడ్లఘట్టకు మరికొంత మంది రైతులు తమ ఉత్పత్తులను తీసుకెళ్తుంటారు. ఇక్కడ గిట్టుబాటు ధర లభించకపోవడంతో శిడ్లఘట్ట, రాంనగర్ వంటి ప్రాంతాలకు రైతులు ఉత్పత్తులు తీసుకెళుతున్నా బెంగళూరు వ్యాపార లావాదేవీలు తగ్గిపోవడంతో గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పట్టుగూళ్ళ ధరలు తగ్గిపోతుండటంతో రైతులు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు.

Related Posts