ఓడిపోతే మొహం చూపించరా
కంచుకోటకు బీటలు
విజయవాడ, అక్టోబరు 5,
గుడివాడ. కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం. తర్వాత తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీల బలం తగ్గిపోయి.. నాయకుల, వ్యక్తుల బలమైన కోటగా మారిపోయింది. దీంతో పార్టీల ప్రభావం ఇక్కడ దాదాపు తగ్గిపోయింది. ఏ పార్టీ అయినా.. బలమైన నాయకుడిపై ఆధారపడే నియోజకవర్గంగా గుడివాడ మారిపోయింది. ఇక, ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు, ఉరఫ్ నాని హవా భారీ ఎత్తున సాగుతోంది. ఆయన టీడీపీలో ఉండగా ఇక్కడ నుంచి పోటీ చేసి ఆ పార్టీ జెండాపైనే గెలుపు గుర్రం ఎక్కారు.అయితే, రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకునేందుకు ప్రయత్నంచేసిన కొడాలి నాని ఆ క్రమంలోనే నియోజకవర్గంలో తనకంటూ.. ఓ వర్గాన్ని, ఓటు బ్యాంకును పెంచుకున్నారు. తాను పార్టీలు మారినా.. తన ఓటు బ్యాంకు.. తన విజయం ఎక్కడా దారి మళ్లకుండా చూసుకున్నారు. తర్వాత చంద్రబాబుతో విభేదాల కారణంగా.. పార్టీకి దూరమై వైసీపీకి చేరువయ్యారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా మారి పోయారు. ఇక, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్న.. కొడాలి నాని ఏ పార్టీ అయినా.. తనదే విజయం అనే రేంజ్‌కు ఎది గిపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి రెండుసార్లు వరుసగా గెలిచిన కొడాలి నాని… వైసీపీ నుంచి కూడా రెండుసార్లు వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. తాజాగా జగన్ మంత్రివర్గంలో బెర్త్‌ను కూడా సొంతం చేసుకున్నారు.ఇక, అప్పటి వరకు ఉన్న టీడీపీ హవా ఇక్కడ సన్నగిల్లింది. అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ.. ఇటీవల ఎన్నికల్లో కొడాలి నానిని దీటుగా ఢీకొనే నాయకుడి కోసం చంద్రబాబు అల్లాడిపోయారు. ఎన్నో తర్జన భర్జనలు, వడపోతలు, సమీకరణల అనంతరం విజయవాడకు చెందిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, దేవినేని అవినాష్‌ను ఇక్కడ నుంచి పోటీకి దింపారు. యువకుడు, ఉత్సాహవంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, కొడాలి నానికి సమ ఉజ్జీ అని చంద్రబాబు భావించారు. స్థానికుడు కాదనే నినాదాలు తెరమీదికి వచ్చినా.. సర్ది చెప్పారు.ఇక, దేవినేని అవినాష్ కూడా తన విజయంపై లెక్కలు వేసుకున్నారు. స్థానికులను ఆకట్టుకునేందుకు మార్నింగ్ వాకుల్లోను, ఈ వినింగ్ పార్కుల్లోనూ .. ప్రజలకు చేరువయ్యారు. తాను ఇక్కడే ఉంటానని, స్థానికుతరుడు అనే ముద్ర రావొద్దని వేడుకున్నారు. అదేసమయంలో ఒకవేళ ఓడిపోతే.. అనే ప్రశ్న కూడా తెరమీదికి వచ్చినప్పుడు.. అయినా సరే.. ఇక నుంచి నా రాజకీయ నగరం గుడివాడే! అంటూ కీలక ప్రకటన చేశారు. రాజకీయ వర్గాల లెక్కల ప్రకారం గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు అవినాష్ రూ.100 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఖర్చు చేశారు. కట్ చేస్తే.. ఆయన ఓడిపోయారు.కానీ, ఆయన గుడివాడ మొహం కూడా చూడడం లేదు. ఏదో ఒక సారి వచ్చి కార్యకర్తల్లో ధైర్యం చెప్పివెళ్లాడు తప్పితే.. ఇక్కడి సమస్యలను కానీ, ప్రజలను కానీ పరామర్శించలేదు. దీంతో పక్కా లోకల్ అంటూనే నాన్ లోకల్ అని నిరూపించావుగా అంటున్నారు ప్రజలు. మరోవైపు ఇప్పటికే నాలుగుసార్లు వరుసగా గెలిచిన కొడాలి నాని ఇప్పుడు మంత్రిగా ఉండడంతో గుడివాడలో ఆయన మరింత బలోపేతం అయిపోయారు. టీడీపీ ద్వితీయ శ్రేణి కేడర్ సైతం ఇప్పుడు టీడీపీని వీడి కొడాలి నాని చెంతకు చేరిపోతోంది. దీంతో గుడివాడలో టీడీపీ కష్టాలు మరి కొన్నేళ్లు కంటిన్యూ అవనున్నాయి.