ఏపీలో మళ్లీ మహాకూటమి
విజయవాడ, అక్టోబరు 5,
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాక మీదున్నాయి. ఒకవైపు డేరింగ్ నిర్ణయాలతో జగన్ దూసుకుపోతుంటే, మరోవైపు ఏ నిర్ణయంపై, ఎలాంటి విమర్శలు చేస్తే, జనంలో ఎలాంటి అభిప్రాయం కలుగుతుందోనని, విపక్షాలు కక్కలేక, మింగలేక అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. అయితే, ముందు నుంచి విమర్శల జడివానకే ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు, బీజేపీ, జనసేనల ముందు కొత్త ప్రతిపాదన పెట్టారట. ఇంతకీ ఏంటది? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి, కోలుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది తెలుగుదేశం. ప్రభుత్వం ఏర్పడిన నెల, రెండు నెలల నుంచే విమర్శల బాణాలు సంధిస్తోంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందని, గ్రామాల్లోకి రానివ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. రద్దుల పద్దులు, కూల్చివేతలు, నిలిపివేతల ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. గ్రామసేవకుల ఉద్యోగాలు, తాజాగా సచివాలయ ఉద్యోగాలపైనా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు సీఎం జగన్. తన పనితాను చేసుకుపోతూ, బాబు మాటలకు అసలు ప్రాధాన్యమివ్వడం లేదు. జగన్ నుంచి రియాక్షన్ ఏమీ లేకపోవడంతో, చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నారట. బీజేపీ, జనసేనలతో కలిసి ఆందోళనలు చేయాలని, జగన్ సర్కారు తప్పిదాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు.జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ, ఈమధ్య స్వరం పెంచుతోంది బీజేపీ. రాజధాని రైతులకు బాసటగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆందోళనల్లో పాల్గొన్నారు. తిరుమలలో అన్యమత ఉద్యోగులు, సీమకు నీళ్లు, నిధులంటూ బీజేపీ నేతలు గొంతెత్తుతున్నారు. అటు జనసేన కూడా జగన్ వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదంటూ విమర్శలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని పవన్ కామెంట్లు చేశారు. దీంతో అటు బీజేపీ, ఇటు జనసేనలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి కాబట్టి, మూడు పార్టీలూ కలిసి, ఒకే వేదిక ద్వారా సర్కారుపై ఆందోళనలు చేస్తే, ప్రజల్లోకి మెసేజ్ బలంగా వెళుతుందని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. దీనికితోడు బీజేపీకి దగ్గరైతే, అన్ని విధాలా తనకు మంచిదని ఆలోచిస్తున్నారట. అందుకే బీజేపీలోని తన సన్నిహితుల ద్వారా, కాషాయ పెద్దలతో మాట్లాడిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం బాబు వెల్‌కం సాంగ్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే, టీడీపీనే రీప్లేస్ చేసి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే సీమ వెనకబాటుతనం, తిరుమల వివాదాలు, రాజధానిపై నిర్లక్ష్యం వంటి భావోద్వేగ అస్త్రాలను సంధిస్తోంది. మరి టీడీపీ స్థానాన్ని ఆక్రమించి ఎదగాలనుకుంటున్న బీజేపీ, అదే టీడీపీతో ఎలా కలుస్తుందనేది అంతులేని ప్రశ్న. అందుకే తమతో తిరిగి కలవాలనుకుంటున్న చంద్రబాబుతో, డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తోందట బీజేపీ. టీడీపీతో పొత్తు ప్రస్తావన అసలు తేవొద్దని, స్టేట్ లీడర్లకు స్పష్టమైన ఆదేశాలిస్తోందట. టీడీపీలో అసంతృప్తులు, కీలకమైన నేతలు బీజేపీలోకి వచ్చేలా చక్రం తిప్పాలని సూచిస్తోందట. అంటే, ఓవైపు బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే చంద్రబాబును వీలైనంత దూరం పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందన్న మాట. అంటే, బీజేపీతో బాబు వియ్యం ఈసారి సెట్ కాదని, జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇక బీజేపీ కాకుంటే కనీసం జనసేనతోనైనా కలవాలని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. ప్రభుత్వంపై ఇద్దరి విమర్శలు ఒక్కటే కాబట్టి, కలిసి పోరాడదామని పవన్ కల్యాణ్‌కు, కొందరు నేతలతో సందేశం పంపిస్తున్నారట. క్షేత్రస్థాయిలో బలం పుంజుకుని, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న పవన్ కల్యాణ్, ఇప్పుడప్పడే కలిసే ఉద్దేశం లేదని, అంత తొందరగా కలవాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారట. అంటే, ఉమ్మడి పోరాటానికి అటు బీజేపీనే కాదు, ఇటు పవన్ కల్యాణ్ కూడా నో అంటుండటంతో, బాబు బేజారెత్తిపోతున్నారట. అయినా ఎవరు కలిసొచ్చినా, రాకపోయినా క్షేత్రస్థాయిలో బలంగా వున్న తమ పార్టీ, సొంతంగా పోరాడుతుందని అంటున్నారట చంద్రబాబు. రెండు పార్టీలతో జట్టుకట్టాలనుకోవడం వెనక చంద్రబాబుకు మరో వ్యూహం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. జనసేనలోనూ చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలతో కలిసి పోరాటం చేయడం ద్వారా, ఆ పార్టీలోకి టీడీపీ నేతలు వెళ్లకుండా చూసుకోవచ్చని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. మూడు పార్టీలు ఓకే వేదికపై వుంటే, పోటాపోటీ వుండదు కాబట్టి, తెలుగు తమ్ముళ్లు కూడా జంప్ జిలానీ ఆలోచనలు చేయరని అనుకుంటున్నారట. అయితే, చంద్రబాబు ఎత్తుగడలను గమనిస్తున్న బీజేపీ, జనసేనలు తమదైన శైలిలోనే, డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నాయని అర్థమవుతోంది. మొత్తానికి పార్టీకి పునరుజ్జీవం కోసం రకరకాల వ్యూహాలు వేస్తున్న చంద్రబాబు, మున్ముందు ఇంకెలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.