అక్రమాల ఆటోనగర్ డంపింగ్ యార్డ్ మూసేశారు
హైద్రాబాద్, అక్టోబరు 5,
ఆటోనగర్ డంపింగ్ యార్డు మూతపడింది. ఇది జరిగి సంవత్సరాలు కావస్తున్నది. అయితే చెత్త పారబోతను బంద్ చేసినా ఇక్కడ జంతు కళేబరాలను పారపోసే కేంద్రంగా మార్చింది. ఇలా జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా చనిపోయే జంతుకళేబరాలను ఇక్కడికి తెచ్చి ఖననం చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధ్దంగా సదరు కాంట్రాక్టర్ యథేచ్ఛగా పారబోస్తుండటంతో ఆ దుర్వాసనతో కాలనీవాసులు నానాఅవస్థలు పడుతున్నారు. ఈ సమస్య తీవ్రం కావడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆటోనగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాం తాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆటోనగర్ డంపింగ్ యార్డులో చెత్తను వేయడం ఆగినా జంతు కళేబరాల గుట్టలను వేయడం మాత్రం ఆగకపోవడంతో ఇది మరో దుర్గంధపూరిత ప్రాతంగా మారిపోయింది. వర్షాలు కురిసిన సమయంలో ఈ దుర్వాసనల ధాటికి కాలనీల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డపింగ్‌యార్డుపై పత్రికల్లో కథనాలు వచ్చినా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవంగా నగరంలో చనిపోయిన జంతువుల కళేబరాలను ఆటోనగర్ డంపింగ్ యార్డుకు తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు పాతబస్తీకి చెందిన వారు కావడం, వారంతా కొందరి మద్దతును కూడగట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.ఆటోనగర్ చెత్త డంపింగ్‌యార్డుతో నిత్యం అవస్థలుపడుతున్న ప్రజలు సంవత్సరాల తరబడి చేసిన పోరాటంతో చెత్త డంపింగ్ యార్డుకు ఆటోనగర్ నుంచి విముక్తి కలిగింది. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించా రు. ఆ సమయంలో ఆటోనగర్ చెత్త ప్రాంతాన్ని మంచి బొటానికల్ గార్డెన్‌గా మార్చి స్థానికులకు మేలుచేయాలని సంకల్పించినప్పటికీ అది నెరవేరలేదు. ఆటోనగర్ డంపింగ్ యార్డు పోయిందని సంబరపడిపోతున్న పరిసర కాలనీలవాసులకు జంతు కళేబరాల డంపింగ్ మరింత తలనొప్పిగా మారింది. ఈ విషయంలో పలుమార్లు కాలనీలప్రతినిధులతోపాటుగా స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం ఉం డటంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆటోనగర్ డంపింగ్ యార్డులో జంతువుల కళేబరాల పారబోయే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి నూతనంగా ఏర్పాటుచేసిన చర్లపల్లి ప్రాంతంలో, నాగోలులోని ఎనిమల్ కేర్ సెంటర్ పక్కన కేటాయించిన స్థలంలో జంతువుల ఖననం చేయాల్సి ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంకా ఆ ప్రాంతంలో జంతువుల ఖననం, బర్నింగ్ కార్యక్రమం చేపట్టడం లేదు. ఆటోనగర్ డంపింగ్ యార్డులోని పూర్తి నిర్జనప్రాంతంలో జంతువులను గుంతల్లో వేసి పూడ్చివేయాలని నిబంధనలు కచ్చితంగా చెబుతున్నా సదరు వ్యక్తులు కళేబరాలను యథేచ్ఛగా పడవేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.జంతువుల కళేబరాల నుంచి చర్మం వలుచుకుని దందా చేయడం, ఎముకలు, కొమ్ముల నుంచి నూనెలు తీయడం, పౌడర్‌గా మార్చి టీపొడిలో కలిపేందుకు విక్రయించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ విషయాలు గతంలో కూడా పలుమార్లు పత్రికలు, చానల్స్‌లో వచ్చాయి. అధికారు లు ఇంత పఠిష్టంగా ఉన్నా సదరు కాంట్రాక్టర్లు, చట్టాన్ని అతిక్రమిస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు