యాసంగికి కసరత్తు షురూ...
కరీంనగర్, అక్టోబరు 5,
కరీంనగర్ జిల్లాలో ఈసారి సమృద్ధిగా పంటలు సాగ య్యే అవకాశాలు ఉండడంతో అధికారులు విత్తనాలు, ఎరువుల ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. సాగు అంచనాలను బట్టి జిల్లాకు వరి విత్తనాలు 44,043 క్వింటాళ్లు అవసరం ఉంటాయి. ఇందులో 5,229 క్వింటాళ్లు సబ్సిడీకి ప్రతిపాదనలు ఇచ్చారు. 5,756 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉండగా 1,981 క్వింటాళ్ల సబ్సిడీకి ప్రతిపాదనలు పం పారు. అలాగే మినుములు 10 క్వింటాళ్లకు 3.4, పెసర 30 క్వింటాళ్లకు 8.12, శనగలు 1,790 క్వింటాళ్లకు 304.5 క్వింటాళ్ల సబ్సిడీకి ప్రతిపాదనలు పంపారు. అలాగే మక్కజొన్న విత్తనాలు 2,323 క్వింటాళ్లు, నువ్వు లు ఒక క్వింటాలు అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు వీటి సబ్సిడీకి ప్రతిపాదనలు పంపలేదు. ఇక ఎరువుల అవసరాన్ని కూడా అధికారులు అంచనాలు రూ పొందించారు. ఏ పంటకు ఏ ఎరువు ఎంత అవసరం ఉంటుందనేది కూడా అంచనాలు వేశారు. అన్ని పంటలకు కలిపి యూరియా 31,433, డీఏపీ 19,354, కాంప్లెక్స్ 10,955, ఎంఓపీ 6,292 క్వింటాళ్ల చొప్పున మొత్తం ఎరువులు 68,034 క్వింటాళ్లు అవసరం ఉంటాయని భావిస్తున్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో మొదట వర్షాలు అనుకూలించ లేదు. జూన్‌లో కేవలం ఐదు రోజులు మాత్రమే కురిశాయి. సాధారణ వర్షపాతం 124.5 మిల్లీ మీటర్లు కాగా, కేవ లం 72.7 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆ తర్వాత జూలైలో కూడా రెండు వా రాల పాటు వర్షలు ముఖం చాటేశాయి. వా నాకాలం పంటలపై ఆశలు మినుకు మినుకు మంటున్న తరుణంలో జూలైలో ఒక్కసారిగా వర్షాలు పుంజుకున్నాయి. ఈ నెల సాధారణ వర్షపాతం 265.9 మిల్లీ మీటర్లు కాగా 292.7 మిల్లీ మీటర్లు కుసిరింది. ఆగస్టులో నూ ఇదే పరిస్థితి. ఈ నెలలో 13 రోజులు వ ర్షాలు కురవగా, 201.7 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి 233.5 మిల్లీ మీటర్లు కురిసింది. సెప్టెంబర్‌లో అయితే భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నెలలో 18 రోజుల పాటు కురిసింది. 112.6 మిల్లీ మీటర్ల సాధారణానికి ఏకంగా 270.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో చెరువులు కుంటల్లోని పుష్కలంగా నీరు వచ్చి చేరింది. బావులు, బోర్లు కూడా పునరుజ్జీవం పోసుకున్నాయి.జిల్లాలో 1,376 చెరువులు, కుంటలు ఉంటే 540 చెరువుల్లోని పాక్షికంగా నీళ్లు వచ్చాయి. మిగ తా 836 చెరువుల్లో యాసంగి సాగుకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా కా ళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లతో జిల్లాలోని చెరువులు, కుంటలు నింపుతున్నారు. కొత్తపల్లి, గన్నేరువరం, చిగురుమామిడి, సై దాపూర్, తిమ్మాపూర్ మండలాల్లోని పలు చె రువుల్లోకి కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఇటు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి గంగాధర, రామడుగు మండలాల్లోని పలు చెరువులకు నీళ్లు చేరుతున్నాయి. ఫలితంగా ఇ పుడు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా నీరు అం దుబాటులో ఉండటంతో రైతులు యాసంగి సాగుకు భరోసాగా ముందుకు సాగుతున్నారు.ఆశించిన వర్షాలు కురిసి వానాకాలంలో అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి. పుష్కలమైన నీరు అందుబాటులో ఉండడం తో యాసంగిలో పంటల విస్తీర్ణం పెరిగే అవకాశాలుంటాయని భావించిన అధికారులు అందుకు తగ్గట్లుగానే అంచనాలు రూపొందించారు. 2018-19 యాసంగిలో 1,74,872 ఎకరాల్లో పంటలు సాగవుతాయ ని అంచనా వేసిన అధికారులు ఈ సారి 2,15,724 ఎకరాల్లో సాగయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో అత్యధికంగా 1,76,172 ఎకరాల్లో వరి పంటనే సాగవనుంది. 29,028 ఎకరాల్లో మొక్కజొన్న, 3,580 ఎకరాల్లో శనగలు, 4,797 ఎకరాల్లో వేరు శనగ, 2,147 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. నిరుటితో పోల్చుకుంటే అన్ని పంటల విస్తీర్ణం భారీగా పెంచారు. గతేడాది 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అంచనా వేస్తే ఈ సారి 1,76,172 ఎకరాలకు సిద్ధం చేశారు. అంటే 36,172 ఎకరాల్లో ఈసారి వరి అత్యధికంగా సాగవనుంది. శనగ గత యాసంగిలో కేవలం 622 ఎకరాలకు మాత్రమే అంచనాలు వేశారు. ఈసారి మాత్రం 3,580 ఎకరాలకు అంచనాలు సిద్ధం చేశారు. నీరు అందుబాటులో ఉండడంతో ఇలా ప్రతి పంట అంచనాలను అధికారులు పెంచారు.యాసంగిలో ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా ఆస్కారం ఉండడంతో రైతులు తప్పని సరిగా బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీయమం చెల్లించుకోవాలని కోరుతున్నారు. వరికి ఎకరాకు రూ.34 వేలు బీమా ఉంటుంది. దీనికి గాను బీమా ప్రిమియం మొత్తం రూ.680 కాగా, ప్రభుత్వం రూ.170 చెల్లిస్తుంది. రైతుల వాటా కింద రూ.510 చెల్లిస్తే సరిపోతుంది. డిసెంబర్ 31 వరకు వరికి బీమా ప్రీమియం చెల్లించేందుకు గడు వు ఉంది. మక్కజొన్న ఎకరాకు రూ.25 వేలు చెల్లిస్తారు. దీనికి మొత్తం ప్రీమియం రూ.625 కాగా ప్రభుత్వం రూ.250 చెల్లిస్తుం ది. రైతులు రూ.375 చెల్లిస్తే సరిపోతుంది. మక్కజొన్నకు ప్రీమియం చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు గడువు ఉంది. అలాగే వేరుశనగ పంటకు ఎకరాకు రూ.22 వేలు చెల్లిస్తారు. మొత్తం ప్రీమియం రూ.1,100 కాగా ప్రభుత్వం రూ. 770 చెల్లిస్తుంది. రైతులు తమ వాటాగా రూ.330 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పంటకు ప్రీమియం చెల్లించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ పంటలు సాగు చేసే రైతులు తప్పని సరిగా బీమా ప్రీమియం చెల్లించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని కోరారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు రెన్యువల్ చేసుకుంటేనే బీమా వర్తిస్తుందనీ, రుణాలు తీసుకోని రైతులు నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి ప్రీమియం చెల్లించుకోవచ్చని ఆమె సూచించారు..
<