ఎంపీడివో వివాదం వెనుక కాకాని
నెల్లూరు,
కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. ఆది నుంచి కూడా దూకుడు స్వభావం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన నియోజక వర్గానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నించడం లోను, పరిష్కారించడంలోనూ, విమర్శించడంలోను కూడా కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. వైఎస్ హయాంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించారు. తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, 2014లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లిలో కాకాణి గోవర్థన్ రెడ్డి మట్టికరిపించారు.నిజానికి సోమిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఎమ్మెల్సీగా ఛాన్స్ అందుకుని మంత్రి అయ్యారు. ఈ క్రమంలోనూ ఆయనను తీవ్ర విమర్శలు, కౌంటర్లతో కాకాణి గోవర్థన్ రెడ్డి ఇరుకున పెట్టేవారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి.. వర్సెస్ కాకాణి గోవర్థన్ రెడ్డి మధ్య పోరు ఉధృతంగా సాగింది. నువ్వా నేనా అనే రేంజ్‌లో సాగిన ఎన్నికల యుద్ధంలో విజయం సాధించిన కాకాణి గోవర్థన్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఖాయమని కాకాణి గోవర్థన్ రెడ్డి భావించారు. కానీ, అనూహ్యంగా మేకపాటి గౌతంరెడ్డికి, అనిల్ యాదవ్‌కు ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే కాకాణి గోవర్థన్ రెడ్డిలో తీవ్ర ఆవేదన సంతరించుకుంది.ఇదిలావుంటే, రెండున్నరేళ్ల తర్వాత అయినా ఖచ్చితంగా కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. రెండున్నరేళ్ల తర్వాత అయినా జగన్ రెడ్డి కోటాలో గౌతంరెడ్డిని తప్పించినా ఈ జిల్లా నుంచి మంత్రి వర్గంలో పోటీకి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రెడీగా ఉన్నారు. అంటే.. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే..తనకు బెర్త్ ఖరారు కాదని బహుశా కాకాణి గోవర్థన్ రెడ్డి భావించి ఉంటారని అంటున్నారు. కోటంరెడ్డి కూడా చాలా దూకుడుగా ఉండే నేత. పైగా జగన్‌కు హార్డ్ కోర్ అభిమాని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ఇరుకునపెట్టారు. ఇక, జగన్ వాయిస్‌ను బలంగా వినిపించే నాయకుడిగా కూడా కోటంరెడ్డి పేరు తెచ్చుకున్నారు.ఇటు కాకాణి గోవర్థన్ రెడ్డి సర్వేపల్లిలో వరుసగా రెండుసార్లు గెలిస్తే… అటు కోటంరెడ్డి నెల్లూరు రూరల్‌ను తన కంచుకోటగా మార్చేసుకున్నారు. దీంతో మరో రెండున్నరేళ్ల తర్వాత.. తనకు మంత్రి సీటు విషయంలో కోటంరెడ్డి పోటీ వస్తాడని భావించిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టివివాదం చేయాలని చూస్తున్నట్టు కనపడుతోంది. ఈ క్రమంలోనే ఎంపీడీవో వివాదం తెరమీదికి వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని నిశితంగా గమనిస్తే.. ఒక ఎంపీడీవో అంత ధైర్యంగా వెళ్లి ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఫిర్యాదు చేసిందంటే.. దీని వెనుక నిజంగానే కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నారని అందరికీ అర్థమయ్యే విషయమే. నిజానికి ఏదైనా జరిగి ఉంటే.. పరిష్కరించుకునేందుకు మార్గాలు అనేకం ఉంటాయి. కానీ, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ కారణంగానే కనిపిస్తోందని అంటున్నారు.ఇక కాకాణి గోవర్థన్ రెడ్డి దూకుడుగానే ఉన్నా.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితం అవుతున్నాయి. అదే కోటంరెడ్డి మీడియాలో స్టేట్ వైడ్ గానే కాకుండా… రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా హైలెట్ అవుతున్నారు. జగన్‌ను విమర్శించే టీడీపీ నేతలను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం… ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేపైనే అనుమానం వ్యక్తం చేశారు.