YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నేతన్నపై అనుకోని భారం.. (కృష్ణాజిల్లా)

నేతన్నపై అనుకోని భారం.. (కృష్ణాజిల్లా)

నేతన్నపై అనుకోని భారం.. (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, : నేతన్నకు బకాయిల భారం వెంటాడుతోంది.. నేతపై ఆశ దూరమవుతోంది.. పేరుకుపోయిన వస్త్రాలను చూసి కంటతడి ఆరకుంది.. నైపుణ్యం ప్రదర్శించి.. సంప్రదాయ సొబగులద్ధి. రెక్కల కష్టం జోడించి తయారు చేసిన నేత వస్త్రం అమ్ముడుపోనంటోంది. జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది నేత పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 సంఘాలు ఉండగా వాటిలో కొన్ని మూత పడ్డాయి. ప్రస్తుతం 33 సంఘాలు వస్త్ర ఉత్పత్తులు చేస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం పెడన నియోజకవర్గంలో ఉన్నాయి. పెడన, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోలవరం, ఐదుగుళ్లపల్లి, మల్లవోలు, రాయవరం గ్రామాలతోపాటు మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి, ముదినేపల్లి, మొవ్వమండలం కాజ తదితర ప్రాంతాల్లో చేనేతసంఘాలు ఉన్నాయి. 12వేల మగ్గాలతోపాటు సరులు, డైయ్యింగ్‌ తదితర పనుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 30వేల మంది వరకు ఉపాధి పొందేవారు. ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వస్త్రాల తయారీకి ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించడంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్రభావం వినియోగాదారులపై కూడా పడి విక్రయాలు కూడా తగ్గిపోయాయి. చీర తయారీకి ఉపయోగించే నూలుపై 5, జరీపై 18శాతం ఇలా రంగులు, ఇతరత్రాలపై కూడా జీఎస్టీ ఉండటంతో ధర పెంచి విక్రయించాల్సివస్తోంది. గతంలో ఒక్కో చీర రూ.1000 నుంచి రూ.1200 ఉంటే ప్రస్తుతం రూ.1500లకు విక్రయిస్తున్నారు. వీటన్నింటినీ తట్టుకొని ఎలాగొలా ఉత్పత్తులు చేస్తున్నా బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సంఘానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ బకాయిలు రావాల్సి ఉంది.  కార్మికులకు వేతనాలు చెల్లించలేక, ఇప్పటికే ఉన్న నిల్వలను విక్రయించుకోలేక సహకారసంఘాల ప్రతినిధులు ఉత్పత్తులు నిలిపివేశారు. నేత పరిశ్రమతోపాటు కలంకారీ పరిశ్రమ కూడా ఇబ్బందులు పడుతోంది. ఒకప్పుడు పెడన పట్టణంలో 70 వరకు బల్లలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 10కి చేరింది. గూడూరు మండలం కప్పలదొడ్డిలో కేవలం రెండు చోట్ల మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రీన్‌ ప్రింటింగ్‌కు అంతగా డిమాండ్‌ లేక పోవడంతో క్రమేపీ ఈ పరిశ్రమను ఉపాధిగా ఎంచుకున్న వారి సంఖ్యకూడా గణనీయంగా తగ్గిపోయింది. చాలా చోట్ల పరిశ్రమలు మూతపడ్డాయి. కేవలం హ్యాండ్‌ప్రింట్‌ మాత్రమే కొనసాగుతోంది. ఈ పరిశ్రమను నమ్ముకున్న వారు సైతం ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. ఇలా ఇటు నేత, అటు కలంకారీ పరిశ్రమల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. నేత పరిశ్రమను ఆదుకొనే క్రమంలో నూలు రాయితీ, పావలావడ్డీ రుణాలు, వస్త్రాలపై రాయితీ ఇలా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన రాయితీలు గతేడాది నుంచి విడుదల కాలేదు. నూలు రాయితీ 2018-19 సంవత్సరానికి రూ. కోటికిపైగా రావాల్సి ఉంది. పావలావడ్డీ నిధులు 2016-17లో రూ.68 లక్షలు ఇచ్చారు. ఇంతవరకు మళ్లీ విడుదల కాలేదు.  20శాతం రాయితీ పథకంలో కూడా రూ.1.41 కోట్లు అదే సంవత్సరం అందించారు. 2018-19, 2019-20 సంవత్సరాలది కూడా రావాల్సి ఉంది. ఆప్కో నేత కార్మికులను ఆదుకుంటుందా అంటే అవునని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా సంఘాల ద్వారా కొనుగోళ్లు చేసిన వస్త్రాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఆప్కో డీఎం కార్యాలయానికి వచ్చి అక్కడ నుంచి సంఘాలకు జమచేసేవారు. ఇకపై ప్రభుత్వం నుంచి నేరుగా సంఘాలకు జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల బ్యాంకు ఖాతా, పాన్‌ నెంబర్లు సేకరించారు. దీంతోపాటు ఆప్కో ద్వారా విస్తృత వ్యాపారం చేసేలా పలు చోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అమల్లోనే జాప్యం చోటుచేసుకుంటోంది. రెండు విడతలుగా వివిధ సంఘాల నుంచి ఆప్కో వస్త్రాలు కొనుగోలు చేసింది. వాటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్ల రావాల్సి ఉంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సంఘాల ఖాతాల్లో జమ కాలేదు.

Related Posts