బాబుకు పెరుగుతున్న శాశ్వత శత్రువులు
విజయవాడ,
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. రాజకీయాలు ఎప్పుడూ పాకుడు రాళ్లే.. అన్న దేవులపల్లి మాటల సారమో ఏమో.. కానీ.. పాకుడు మెట్లపై రాజకీయ నేతలు చేసే కుస్తీలు భలేగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు ప్రత్యర్థులుగా మారతారు. అయితే, కొందరు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులుగా మారినా.. తర్వాత కాలంలో మాత్రం కలుసుకుంటారు. చేతులు కలుపుతారు. కానీ, కొందరు మాత్రం బద్ధ శత్రులుగా మారిపోతారు. ఇదేదో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జిల్లాల నుంచి వచ్చిన నాయకులు అయితే… సరే అని మనం సరిపుచ్చుకోవచ్చు.కానీ, టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఇదంతా చాలా వరకు రివర్స్‌లో కనిపిస్తోంది. అంటే, ఆయనకు శాశ్వత శత్రువులు ఎక్కువగా కని పిస్తున్నారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చంద్రబాబుకు శత్రువులు పెరుగుతున్నా రని అంటున్నారు. తెలంగాణ అధికార పార్టీ నుంచి ఏపీ అధికార పార్టీ సహా చంద్రబాబుకు శత్రువులే. అయితే, ఏపీలో అంటే.. అదికారం కోసం పాకులాట ఉన్న నేపథ్యంలో జగన్ తో వైరం ఉంటే ఓకే అని సరిపుచ్చుకోవచ్చు. కానీ, తెలంగాణలో ఎలాంటి ప్రాతినిధ్యం పెద్దగాలేని చోట కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో శత్రువులను పెంచుకుంటున్నారు. తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టారు. నిజానికి ఇలాంటి సమయంలో పోటీ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. దీనిని అప్పట్లో అందరూ సరే.. జాతీయ పార్టీ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి.. ఓకే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏ అవసరం ఉందో ఆయన హుజూర్‌నగర్ ఉప పోరులో ఎందుకు చంద్రబాబు వేలు పెడుతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. పోనీ.. ఆయన కాంగ్రెస్‌కు మేలు చేయాలని భావిస్తే.. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి చేకూరే ప్రయోజనం ఏంటో కూడా అర్ధం కావడం లేదు.తెలంగాణ అధినేత కేసీఆర్ దృష్టిలో మాత్రం చంద్రబాబు చులకనై పోతున్నారు. అదే సమయంలో మరింత మంది శత్రువులను కూడా పెంచుకుంటున్నారు. కశ్మీర్ విషయంలో బీజేపీని సమర్ధించారు. ఆర్టికల్ 370 రద్దును సబబేనని ప్రకటించారు. దేశంలోని చాలా మంది మేధావులు వ్యతిరేకించిన ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు పూసుకున్నా.. బీజేపీ నుంచి కనీస స్పందన కనిపించలేదు. తాను బీజేపీకి మద్దతుగా మాట్టాడాను కాబట్టి.. ఇక, తనకు బీజేపీ నుంచి విమర్శలు ఉండవని భావించినా… మరింత మంది నేతలను టీడీపీ నుంచి లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న విషయం వాస్తవం. మరి ఇంతగా శత్రువులను పెంచుకునే అవసరం ఎందుకు? వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మేలు కదా! అంటున్నారు పరిశీలకులు.