అప్పుల కుప్పగా మారుతున్న ఏపీ
విజయవాడ,
రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, విమర్శలను పక్కన పెడితే.. సాధారణ ప్రజలకు మాత్రం పాలన విషయంలో 85 పర్సెంట్‌బాగానే ఉందని ఫీల్ అవుతున్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా కనిపిస్తోంది. నిజానికి రాష్ట్ర ఆవిర్భావం నాటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఖజానా.. గత ఐదేళ్ల కాలంలో మరింతగా దిగజారిపోయింది. విచ్చలవిడి ఖర్చు, దుబారా వ్యయంతో పాటు.. పసుపు-కుంకుమ వంటి నిరర్ధక పథకాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా మరింత కుంగిపోయింది. ఇక, ఎన్నికల సమయానికి రైతులకు ఇవ్వాల్సిన రెండు విడతల రుణ మాఫీని కూడా చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అదే సమయంలో పసుపు-కుంకుమ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున బదలాయింపు చేశారు.ఒక్క ఇసుక కొరత తప్పితే.. మిగిలిన విషయాల్లో జగన్ ప్రభుత్వం పారదర్శకంగానే పనిచేస్తోంది. ఉద్యోగ, ఉపాధి కల్పన, మద్య నిషేధం దిశగా అడుగులు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం, పింఛన్లు, ఉద్యోగాలు వంటి కీలక నిర్ణయాలను వడివడిగా అమలు చేయడంలో జగన్ మంచి ట్రాక్ రికార్డు చూపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆర్థిక పరిస్థితి మాత్రం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది.వెరసి మొత్తంగా రాష్ట్రాన్ని అప్పుల ఖాజానాను వైసీపీ ప్రభుత్వానికి అప్పగించినట్టయింది. నిజానికి ఇప్పుడు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదంటే.. దీనికి ప్రధాన కారణం.. గత పాలకుల నిర్వాకాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయినప్పటికీ.. జగన్ చాలా ఓర్పుతో నేర్పుతో పాలనను ముందుకు సాగిస్తున్నారు. అందరూ చెప్పుకొంటున్నట్టు ఆయన కేవలం ఒకే ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ.. తన సౌకర్యాలను కూడా తగ్గించుకుంటూ.. ప్రజల సొమ్ముకు పూచీ వహిస్తున్నారు.ఇంత చేసినా.. ఇబ్బందులు ఇబ్బందులుగానే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు భారీ ఎత్తున ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వంపై ఈ అదనపు భారం మరింతగా పడనుంది. మరి ఈ నేపథ్యంలో జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం… నిధుల పెంపు. రాష్ట్రంలో ప్రజలపై ఆర్థికంగా భారం కానటువంటి మార్గాలను ఎంచుకుని జగన్ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే.. రాష్ట్రంలో ఆయన కోరుకున్న మార్పులు సాకారం అవుతాయి.