భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ కంటే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉండడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట కావడంతో ఇక్కడి ఫలితాలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. గతేడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో లోక్‌సభ ఎంపీలుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, కేశవ్ మౌర్య తమ పదవులకు రాజీనామా చేశారు. యోగి సీఎంగా, మౌర్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఇద్దరూ ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, ఫుల్పూర్ స్థానాల్లో తాజాగా గత ఆదివారం ఉపఎన్నికలు జరిగాయి.
ఫుల్పూర్‌లో ఇప్పటికే తొమ్మిది రౌండ్ల మేర ఓట్ల లెక్కింపు పూర్తి కాగా సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ కంటే 9924 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇక యోగి నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోనూ సమాజ్ వాదీ అభ్యర్థి 15 వందల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు.