ఏపీ సీజేగా మహేశ్వరీ ప్రమాణం
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీజే మహేశ్వరితో ప్రమాణం చేయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అధికారుల పొరపాటు కారణంగా చీఫ్ జస్టిస్ రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉండడంతో తొలుత అలాగే ప్రమాణం చేశారు. గవర్నర్, చీఫ్ జస్టిస్ ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ అనే చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి మరోసారి ప్రమాణం చేయించారు. ఆయన మధ్యప్రదేశ్‌కి చెందిన వారు కావడం గమనార్హం.సీజేగా బాధ్యతలు తీసుకున్న మహేశ్వరిని, వైఎస్ జగన్ అభినందించారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన విందుకు మహేశ్వరి, జగన్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారుహైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29వ తేదీన జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రావీణ్యం సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తిగా ఎదిగారు.