కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లినట్టేనా
విజయవాడ,
ఎర్రజెండెర్రజెండెన్లీయెల్లో.. ఎర్రెర్రనిదీజెండెన్నీయేల్లో… అన్నట్టుగా మారిపోయింది. తెలుగు గడ్డపై కమ్యూనిస్టుల పరిస్థితి. దశాబ్దాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు నేడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నా రనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందని ఫలితంగా నేటి తరానికి సీపీఎం, సీపీఐ పార్టీలు దూరమయ్యాయనే చెప్పాలి. నిజానికి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడడంలోను, ప్రజల కష్టాలు పంచుకుని, వాటిని వెలికితీయడంలోను ఒకప్పటి కమ్యూనిస్టు మేధావులకు, నేడు పార్టీలు పట్టుకుని వేలాడుతూ.. తమ సొంత లాభాల కోసం వెంపర్లాడుతున్న నాయకులకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అన్న సీపీఎం కానీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో ప్రజలకు చేరువకావడం తథ్యమని భావించిన సీపీఐ కానీ.. గడిచిన ఆరేళ్ల కాలంలో సాధించిన పురోగతి ఈషణ్మాత్రం లేక పోవడం గమనార్హం. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు కైవసం చేసుకున్నా.. పట్టున్న గిరిజన నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాల్లోనూ నేడు ఈ పార్టీల జెండా పట్టుకునే నాథుడు లేక గింగిరాలు తిరుగుతున్నాయి. 2004లో అప్పటి యూపీఏ-1 ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈ కమ్యూనిస్టులు ఒకటి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా చలాయించాయి.కొన్ని దశాబ్దాల తర్వాత 2004లో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఏకంగా 62 ఎంపీ సీట్లు సాధించాయి. చాలా ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు ఆ ఎన్నికల్లో గొప్ప వైభవం దక్కినట్లయ్యింది. ఉమ్మడి ఏపీలో కూడా 2004 ఎన్నికల్లో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో విజయం సాధించాయి. వీటిల్లో తెలంగాణ నియోజకవర్గాలతో పాటు ఏపీలో గిరిజన నియోజకవర్గాలే అధికం. ఆ తర్వాత యూపీఏ నుంచి బయటకు రావడంతో ప్రారంభమైన డౌన్ ఫాల్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాల నేపథ్యంలో పునాదులు బాగానే వేసుకున్న ఈ రెండు పార్టీలు 2009 నుంచి ఎదురు గాలులు ఎదుర్కొంటున్నాయి.2009లో తెలంగాణలో ఒకింత ఫర్వాలేదనుకున్నప్పటికీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సీటు దక్కించుకోలేక పోయాయి. 2009లో సీపీఎం తెలంగాణలోని భద్రాచలంతో సరిపెట్టుకుంటే…. సీపీఐ తెలంగాణలోనే 4 సీట్లలో గెలిచింది. ఇక, ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీలు జెండా నిలబెట్టుకోలేక పోవడం గమనార్హం. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఊపు తెచ్చుకుందామని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. 2014లో ఏపీలో ఈ రెండు పార్టీల పరిస్థితి సున్నా.. కాగా తెలంగాణలో చెరో సీటులో గెలిచాయి.ఇక ఈ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోనూ కనీసం ఒక్కచోట కూడా విజయం సాధించలేక పోయాయి. తెలంగాణలోనూ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక, పార్టీల అంతర్గత రాజకీయాలు కూడా పెరిగిపోయాయి. కేవలం అగ్రవర్ణాలకు చెందిన వారికే పదవులు దక్కుతున్నాయనే ప్రచారం కొన్నేళ్లుగా ఉంది. దీనిని చెరిపివేస్తామని, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నా.. అది ఎండమావిగానే ఉంది. ఇక, ఒకప్పుడు మహిళలకు ఎనలేని ప్రాధాన్యం కల్పించిన పార్టీల్లో ఇప్పుడు ఆ వర్గానికి కూడా సమ ప్రాధాన్యం దక్కడం లేదు. మొత్తంగా చూసుకుంటే, నేటి తరానికి చేరువ కాని సిద్ధాంతాలు పట్టుకుని వేలాడుతున్న ఈ కమ్యూనిస్టులు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందనేది వాస్తవం. ఇక తెలంగాణలో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంకు ఉన్నా అసలు ఏపీలో ఆ రెండు పార్టీల గురించి కనీసం తలిచే నాథుడు కూడా లేడు.