బన్నీ ఉత్సవంలో 50 మందికి గాయాలు
కర్నూలు,
కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో దసరా రోజున జరిగే కర్రల సమరంలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏటా దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి ఆలయంలో బన్నీ ఉత్సవం పేరుతో ఈ కర్రల సమరాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాన్ని
దక్కించుకునేందుకు పదకొండు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన బన్నీ ఉత్సవంలో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పొరుగున తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్పలు దగ్గరుండి
పరిస్థితిని పర్యవేక్షించారు.కర్రల సమరంలో హింసను నివారించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఈ ఏడాది కూడా ఏ మాత్రం ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనంతో నిఘాను పటిష్టం చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో భద్రత చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. మద్యాన్ని అరికట్టేందుకు అబ్కారీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉత్సవంలో పాల్గొన్న వారిలో అధికశాతం మంది మద్యం తాగి రావడంతో ఎక్కువ మంది గాయాలపాలయ్యారు.బన్నీ ఉత్సవంలో కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్ధరాత్రి వేళ కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరుతారు.
ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పరం తలపడతారు. రక్తం చిందినా లెక్కచేయకుండా తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఈఏడాది కూడా నెరణికి, నెరణికి తండా, కొత్తపేట కొండ ప్రాంతంలో భక్తుల మధ్య అర్ధరాత్రి కర్రల సమరం సాగింది.