రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు పర్యటన
న్యూఢిల్లీ,
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గురు, శుక్రవారాల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన భారత్ రావడానికి ఒక్క రోజు ముందు వరకు అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం గమనార్హం. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జిన్‌పింగ్ పర్యటన ఉండనుంది. ఇరుదేశాల అధినేతలు అనధికారికంగా (ఇన్‌ఫార్మల్) చర్చలు జరపనున్నారు. దీంతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనలు చేయడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటివేవీ ఉండబోవు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ఇలాంటి అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.గత ఏడాది ఏప్రిల్‌లో చైనా వెళ్లిన ప్రధాని మోదీ వుహాన్‌లో జిన్‌పింగ్‌తో ఇలాగే చర్చలు జరిపారు. డోక్లాం ప్రతిష్టంభన తొలగిన తర్వాత జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇప్పుడు మోదీ, జిన్‌పింగ్ మధ్య రెండో అనధికారిక భేటీ జరగనుంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చైనా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనుండటం ఆసక్తి కలిగిస్తోంది.జిన్‌పింగ్ భారత్ రావడానికి ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా చైనా వెళ్లారు. కశ్మీర్ అంశంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేలా చైనాను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ కశ్మీర్ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని డ్రాగన్ సూచించింది.జిన్‌పింగ్ భారత్ పర్యటన సందర్భంగా కశ్మీర్ గురించి మాత్రమే కాకుండా చాలా అంశాలను చర్చిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరపనున్నారు.