సైలెంట్ అయిపోయిన నారాయణ, అజీజ్
నెల్లూరు,
నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇక్కడ నుంచి పార్టీకి అన్నీ తామై వ్యవహ రించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో అసలు ఇక్కడ పార్టీ ఉందా ? లేదా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. విషయం ఏంటంటే.. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి 2014లో ఆశించిన మేరకు సీట్లను దక్కించుకున్న టీడీపీ.. తాజా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ నిర్ణయించుకున్నా, జగన్ సునామీ దెబ్బతో ఆ పార్టీనే జీరో ప్లేస్ కు వెళ్లిపోయింది.ముఖ్యంగా టీడీపీకి అండగా ఉంటారని భావించిన ఇద్దరు నాయకులు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వారే.. నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి.నారాయణ, మరొకరు మాజీ మేయర్ అజీజ్. ఇక్కడ వీరిని చంద్రబాబు పూర్తిగా నమ్మారు. నెల్లూరు సిటీని నారాయణకు కేటాయించగా.. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాన్ని అజీజ్‌కు కేటాయించారు. అయితే, వైసీపీ సునామీ ముందు వీరిద్దరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. అయినప్పటికీ.. టీడీపీని బలోపేతం చేసే దిశగా కూడా ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఏమీ చేయలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 54 సీట్లున్న నెల్లూరు కార్పొరేషన్‌లో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఈ మేరకు పార్టీ అనుచరులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయితే, ఇక్కడ యాక్టివ్‌గా ఉంటారని భావించిన నారాయణ తన విద్యాసంస్థలు సహా సొంత వ్యాపారాల నిర్వహణకే పరిమితమయ్యారు. ఐదేళ్ల పాటు మంత్రిగా ఉండడంతో పాటు నెల్లూరు సిటీని ఎంతగా డెవలప్ చేసినా నియోజకవర్గ ఓటర్లు గెలిపించకపోవడంతో నారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ క్రమంలోనే నారాయణ కుటుంబ సభ్యులు సైతం పార్టీ వల్ల ఒరిగిందేమి లేదని… సంపాదించుకున్నదీ లేదని… రాజకీయాలకు దూరంగా ఉండడంతో పాటు వ్యాపారాల్లో కాన్‌సంట్రేషన్ చేసుకోవడమే బెటర్ అని నారాయణపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కారణం ఏదైనా నెల్లూరు టీడీపీకి నారాయణ దూరం దూరంగానే ఉంటున్నారు. ఇక గతంలో వైసీపీ నుంచి మేయర్‌గా గెలిచిన అబ్దుల్ అజీజ్ ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. ఎన్నికల్లో చివర్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ మారడంతో చంద్రబాబు ఆయనకు రూరల్ సీటు ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. దీంతో ఆయన సైతం రూరల్ నియోజకవర్గానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీని పట్టించుకునే నాధుడు ఎవరూ కనిపించడం లేదు.మరోపక్క, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు వచ్చేపరిస్థితి కనిపించడంలేదు. కార్పొరేటర్లుగా గెలిచే సత్తా ఉన్న వాళ్లు సైతం వైసీపీలోకి జట్టు జట్టుగా వలస వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో పరిస్తితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. ఈ పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్‌లోనే కాకుండా జిల్లా అంతటా ఉంది.