సామాజిక సమీకరణలపై బీజేపీ దృష్టి
విజయవాడ,
ఏపీలో ఎలాగైనా పాగా వేద్దామనుకుంటున్న బీజేపీ ఇపుడు సామాజిక సమీకరణలపైన దృష్టి పెట్టింది. ఇన్నాళ్ళు జాతీయవాదం, హిందూ కార్డ్ అంటూ పైపైన ప్రచారం చేసుకుంటూ పోయింది కానీ కులాల లెక్కలు అసలు పట్టించుకోలేదు. ఫలితంగా బీజేపీ అంటే హిందీ పార్టీగానే జనంలో ఉండిపోయింది. ఇపుడు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. రెండవమారు వరసగా మోడీ గెలవడం అంటే గతంలో కాంగ్రెస్ మాదిరిగా బీజేపీకి జనాలు చాన్సు ఇస్తున్నారని కమలం అంటోంది. పైగా దేశంలో ఏకైక జాతీయ పార్టీగా సుదీర్ఘకాలం అధికారం చలాయించే పార్టీగా తమకు ఉన్న అవకాశాలు ఎక్కువేనని అంటోంది. ఈ నేపధ్యంలో ఇంత అనుకూలతను సొమ్ము చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతేయాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది.ఏపీలో తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం పెట్టనికోటగా ఉంది. టీడీపీ స్థాపించిన నలభయ్యేళ్ళలో ఆ పార్టీ నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు అయితే వారంతా కమ్మ వారే కావడం విశేషం. ఎన్టీయార్, నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు కూడా కమ్మ కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయంగా పునాది నిర్మించుకున్నవారే. ఇక చంద్రబాబు తరువాత కమ్మలు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నా టీడీపీ నుంచి ఆ స్థాయిలో ఎవరూ కనిపించడంలేదు. లోకేష్ మీద కమ్మవారికే విశ్వాసం లేదు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఆ కులానికి గట్టి భరోసా ఇవ్వగలిగితే తెలుగుదేశం ప్లేస్ ని రిప్లేస్ చేయగలమని బీజేపీ అనుకుంటోంది. అందుకే సుజనా చౌదరిని ముందు పెట్టి బీజేపీ రాజకీయ ఆటకు తెరతీసింది.
ఇక మరో వైపు కాపులను కూడా చేరదీయాలన్నది బీజేపీ వ్యూహం. ఏపీలో ఇప్పటివరకూ ముఖ్యమంత్రి పదవి లభించని అతి పెద్ద కులం ఏదైనా ఉందంటే అది కాపులే. ఆ బాధ వారిలో ఉంది. దానిని కనుక సొమ్ము చేసుకుంటే కాపులు తమ దరికి వచ్చి చేరుతారని బీజేపీ వూహిస్తోంది. ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో ఉద్దేశ్యం కూడా అదే. ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన కాపులను వరసగా బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి శనక్కాయల అరుణ బీజేపీలో చేరారు. అదే విధంగా విశాఖ జిల్లాకు చెందిన కాపు నేత తోట నగేష్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన తోట వాణిని కూడా బీజేపీలోకి చేర్చుకోవాలనుకుంటున్నారు. కోస్తాకు చెందిన కాపులే టార్గెట్ గా బీజేపీ దూకుడు సాగుతోంది. ఇక కాపు జాతి పితగా అవతరించిన ముద్రగడ పద్మనాభాన్ని కూడా దువ్వుతున్నారు. ఇలా కాపు, కమ్మ కాంబినేషన్లో కోస్తాలో దూసుకుపోతే అధికారం తధ్యమన్న భావన బీజేపీలో కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.