వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలు
నల్గొండ,
రాష్ట్ర యూనివర్సిటీల్లో కొత్త వైస్‌చాన్స్‌లర్ల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. వీసీల కాలపరిమితి ముగిసిన రెండు నెలలకు, వీసీల నియామకం కోసంసెర్చ్ కమిటీలను వేసిన సర్కారు.. ప్రస్తుతం ఆ కమిటీ సమావేశాలను నిర్వహించే పనిలో నిమగ్నమైంది. పనిలో పనిగా ఏండ్ల నుంచి వర్సిటీల్లో కనిపించని ఎగ్జిక్యూటీవ్ కమిటీ(ఈసీ)లనూ నియమించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో11 యూనివర్సిటీలుండగా, వాటిలో10 యూనివర్సిటీలకు వీసీల్లేరు. ఆర్జీయూకేటీ(బాసర ఐఐఐటీ) మినహా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో వీసీల నియామకాల కోసం ప్రభుత్వం జులై 23న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9 వీసీ పోస్టులకు 984 అప్లికేషన్లు అందాయి. అప్లికేషన్లు వచ్చినా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత నెల 24న యూనివర్సిటీలపై సమీక్ష సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతవిద్యామండలి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అదే తేదీన 9 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించింది. దాదాపు వీసీలంతా ఇన్‌చార్జీలే ఉండటంపై ఆమె ఆరా తీసినట్టు తెలిసింది.సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వారం క్రితమే యూజీసీ, వర్సిటీ నామినీ సభ్యుల ఫోన్ నెంబర్లను సేకరించింది. మీటింగ్‌లు పెట్టేందుకు వారి సమయాన్ని అడుగుతోంది. దసరా తర్వాత సెర్చ్‌కమిటీల మీటింగ్‌లకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో యూనివర్సిటీకి వీసీగా ముగ్గురి పేర్లను సెర్చ్ కమిటీ నామినేట్ చేయాల్సి ఉంది. వారిలో ఒకర్ని గవర్నర్ ఎంపిక చేస్తారు. నెలరోజుల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వర్సిటీలకు కొత్త ఈసీలు కూడా త్వరలోనే కొలువుదీరనున్నాయి. ఒక్కో వర్సిటీలో 8 నుంచి13 మందిని ఈసీ మెంబర్స్‌గా నియమించనున్నారు. తెలంగాణ వచ్చాక ఒక్క వర్సిటీకి కూడా పాలక మండలిని నియమించలేదు. దీంతో వర్సిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాయి. తొమ్మిది వీసీ పోస్టులకు ఏకంగా 984 దరఖాస్తులు
రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పోస్టులకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 9 వీసీ పోస్టులకు ఏకంగా 984 దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 142 మంది అప్లై చేశారు. కులాల వారీగా వీసీలను నియమించేందుకు ఇప్పటికే సర్కారు చర్యలు మొదలుపెట్టినట్టు తెలిసింది. దసరా తర్వాత సెర్చ్ కమిటీల సమావేశాలు ప్రారంభమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. యూజీసీ నామినీ సభ్యులు కొందరు సెంట్రల్ వర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లుగా ఉండటంతో వారి టైమ్ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి దసరా తర్వాతే కొన్ని వర్సిటీల సెర్చ్ కమిటీలు సమావేశమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని తెలుస్తోంది. ప్రక్రియంతా గుట్టుగా జరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టుకు అత్యధికంగా 142 దరఖాస్తులు రాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి అతి తక్కువగా 23 అప్లికేషన్స్ అందాయి. స్టేట్‌లో పెద్ద వర్సిటీ ఉస్మానియాకు 114 దరఖాస్తులు వచ్చాయి. శాతవాహన వర్సిటీకి 125, మహాత్మాగాంధీ వర్సిటీకి 124, పాలమూరు వర్సిటీకి 122, తెలంగాణ వర్సిటీకి 114, కాకతీయ వర్సిటీకి 110, జేఎన్‌టీయూకు 56 వచ్చాయి. ఏ వర్సిటీ వీసీ ఇచ్చినా ఓకే అంటూ మరో 54 దరఖాస్తులున్నాయి. ఈసారి వీసీల నియామకాల్లో అన్ని కులాలకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, బీసీ, ఓసీలకు రెండేసి చొప్పున.. ఎస్టీ, మైనార్టీలు ఒక్కొక్కరిని, మరో పోస్టుకు మహిళను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. యూనివర్సిటీల్లో బీజేపీ భావజాలన్ని ఎదుర్కొనే సత్తా ఉన్నోళ్లనే వీసీలుగా నియమిస్తారనీ వాదనలు వినిపిస్తున్నాయి.