గజ్వేల్–ప్రజ్ఞాపూర్ కు రోడ్డుకు అడ్డంకులు
మెదక్,
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇందిరాపార్క్, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం, పిడిచెడ్ రోడ్డు, ముట్రాజ్‌పల్లి రోడ్డు, తూప్రాన్ రోడ్డు, సంగాపూర్ రోడ్డు వరకు విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో ప్రజలకు తీవ్రమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కేసీఆర్ మెతుకుసీమ గర్జన సభలో కేసీఆర్ ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ బాధలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గజ్వేల్‌లో నిర్వహించిన మొదటి సభలోనే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం తొలుత రూ.90కోట్ల నిధులు మంజూరు చేశారు. ‘రింగ్’ రోడ్డును పట్టణంలోని 133/33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ధర్మారెడ్డిపల్లి గ్రామ శివారు, జాలిగామ శివారు, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్‌టీసీ బస్టాండ్ సమీప ప్రాంతం, శ్రీగిరిపల్లి, హషీమ్ కళాశాల సమీప ప్రాంతం, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్‌ల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు పూర్తిచేస్తే ఈ రహదారి వెంటే భారీ వాహనాలు వెళ్లే అవకాశముండగా ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి.ముందుగా గజ్వేల్ చుట్టూ 19కిలోమీటర్ల రింగ్‌గా 30 మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్నారు...ఇందుకోసం 140 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత డిజైన్ మళ్లీ మార్చారు.. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని చివరకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 22 కిలోమీటర్ల పొడవున రింగురోడ్డు నిర్మాణం జరుగనుంది. 209 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టాలని తుది నిర్ణయానికి వచ్చిన సంగతి విధితమే. కొత్త డిజైన్ ప్రకారం రింగురోడ్డు అంచనా విలువను రూ. 220 కోట్లకు పెంచిన సంగతి కూడా తెలిసిందే. కొత్త డిజైన్‌లో పిడిచెడ్, సంగాపూర్, ధర్మారెడ్డిపల్లి రేడియల్ రోడ్లు కూడా ఉన్నాయి. 209 ఎకరాల భూసేకరణ లక్ష్యానికిగానూ ఇప్పటి వరకు 207 ఎకరాలను సేకరించగలిగారు. ప్రస్తుతం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, గజ్వేల్‌లలో పాక్షికంగా భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితి వల్ల ఆయా ప్రదేశాల్లో పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు రేడియల్ రోడ్ల నిర్మాణాల్లోనూ జాప్యం అలుముకుంది. గజ్వేల్ పట్టణానికి ప్రధాన మార్గాల్లో ఒక్కటైన సంగాపూర్ రోడ్డు కమాన్ వద్ద పనులు అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల నిత్యం కిక్కిరిసి ఉండే ఆ రహదారిపై జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సంత రోజు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మొత్తంగా రింగురోడ్డు 22 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉండగా... 16కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. మిగిలిన 6కిలో మీటర్లలో 2కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జీలు, రైల్వే పనుల కారణంగా రింగురోడ్డు పనులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. మిగతా 4 కిలోమీటర్లలో భూసేకరణ పెండింగ్, ఇతర కారణాలను పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రింగు రోడ్డుకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. వీలైనంత తొందరగా ఈ రోడ్డును అందుబాటులోకి తెచ్చి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కానీ... యంత్రాంగం సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేకమైన యాక్షన్‌ప్లాన్‌తో ముందుకు సాగుతామని గత కొన్ని నెలల క్రితం అధికారయంత్రాంగం ప్రకటించింది.ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఏడాదిగా పనుల్లో స్తబ్ధత నెలకొంది. రింగురోడ్డు పూర్తయితే గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో జంక్షన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జాప్యం వల్ల ఈ పనులు ముందుకు సాగడం లేదు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ వద్ద ‘రింగ్’ రోడ్డును తాకే రాజీవ్ రహదారి కొద్ది నెలల్లో జాతీయ హోదాను పొందుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడబోతుంది. సుమారు 7 కిమీ పొడవునా ‘రింగ్’ రోడ్డు రాజీవ్ రహదారిలో అంతర్భాగం కాబోతుంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నుంచి కుడివైపున ఉండే ‘రింగ్’ రోడ్డు 7కిమీ పొడవు అంటే ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, జగదేవ్‌పూర్‌రోడ్డు, రిమ్మనగూడ గ్రామాల మీదుగా వెళ్లే రోడ్డు రాజీవ్ రహదారిలో కలవనుంది. ఈ నేపథ్యంలోనే ఈ 7కిమీ పొడవును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే 6 లేన్లుగా విస్తరించడానికి నిర్ణయించారు. ఈ లెక్కన ‘రింగ్’రోడ్డు ఆ 7కిమీ పరిధిలో 150 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం జరుగనున్నది. మిగతా చోట 100 ఫీట్లతో నిర్మించనున్నారు. ప్రస్తుతం రిమ్మనగూడ జంక్షన్ వద్ద పనులు ఆగిపోయాయి. పిడిచెడ్ రోడ్డు నల్లవాగు గడ్డవద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.