అక్టోబరు 19 నుండి 21వ తేదీ వరకు
చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల
టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో అక్టోబరు 19 నుండి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 18వ తేదీన అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 19వ తేదీన ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ఠ, మధ్యాహ్నం 3.00 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 20న ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు చేస్తారు. అక్టోబరు 21న ఉదయం 8.00 నుండి 11.30 గంటల వరకు పవిత్ర విసర్జన, చతుష్టాన ఉద్వాసన, కుంభప్రోక్షణ, పవిత్ర వితరణ చేపడతారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మహా పూర్ణాహూతి, స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. .