మంగళగిరిలో నాన్ లోకల్ తలనొప్పి
గుంటూరు,
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భవితవ్యం ఏంటి? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నో ఆశలతో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. లోకేష్ పోటీ చేసేందుకు చంద్రబాబు & టీం దాదాపు రెండేళ్ల పాటు ఎన్నో కసరత్తులు చేసింది. పెనమలూరు, పెదకూరపాడు, హిందూపురం, కుప్పం ఇలా ఎన్నో పేర్లు పరిశీలించి చివరకు మంగళగిరి బరిలో దిగి నారా లోకేష్ ఓడిపోయారు.ఈ నేపథ్యంలో ఇక్కడే ఉంటానని, ఈ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ఎన్నికలు ముగిసిన తర్వాత నారా లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. ఓడిన చోట గెలిస్తేనే మజా ఉంటుందని కూడా చెప్పారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఇక్కడ పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ తన సొంత కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. మరి వచ్చే 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తారా? అలా చేస్తే.. విజయం సాధిస్తారా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అనే చర్చ జోరుగా సాగుతోంది.మంగళగిరి నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ బీసీ సామాజిక వర్గం పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు కూడా ఈ వర్గానికే చెందిన వారు ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఈ సీటును పద్మశాలీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల లేదా ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే చివరకు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ ఫ్యామిలీకి షాక్ తప్పలేదు. ఈ క్రమంలోనే కమల వైసీపీలో చేరి నారా లోకేష్ ను ఓడించాలని మరీ పిలుపు నిచ్చి వైసీపీకి గట్టిగా ప్రచారం చేశారు.వాస్తవానికి లోకేష్‌కు విశాఖలో ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, మంగళగిరిలో ఇవ్వడం ద్వారా రెండు రకాలుగా విజయం సాధించవచ్చని చంద్రబాబు భావించారు. ఒకటి తమ ప్రభుత్వం… రాజధాని నియోజకవర్గం కావడంతో ప్రొటోకాల్ ప్రకారం అన్ని విధాలా కలిసి వస్తుందని… నారా లోకేష్ స్థానికంగా ఉంటూనే నియోజకవర్గంపై దృష్టి పెట్టేందుకు ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఇక, రాజధాని అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది కాబట్టి మంగళగిరిలో గెలుపు గుర్రం ఎక్కడం సునాయాసమని అనుకున్నారు.అయితే, అనూహ్యంగా ఇక్కడ ఆళ్లకే ప్రజలు జై కొట్టారు. మరి వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ పుంజుకుంటారా? అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో నారా లోకేష్ స్థానికుడు కాదని, ఆయనకు పెద్దగా స్థానిక సమస్యలపై అవగాహనలేదని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన నాయకులను పక్కనపెట్టి సీఎం కుమారుడికి టికెట్ ఇవ్వడాన్ని మంగళగిరి మేధావుల సంఘం కూడా జీర్ణించుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.ఇక ఇక్కడ కొన్ని యేళ్లుగా పద్మశాలీలే గెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఇక్కడ పోటీ చేస్తే శాశ్వతంగా తిష్ట వేస్తాడని… ఆ వర్గానికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఉండదేమోనన్న సందేహం కూడా ఆ వర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి లేదా కుప్పం నియోజకవర్గాల్లో లోకేష్ ప్రయత్నం చేస్తే.. మంచిదని సూచిస్తున్నారు. మరి బాబు ఈ దిశగా ఆలోచన చేస్తారా? లేదంటే.. వారసుడికి దీర్ఘకాలిక ఓటములే అందిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.